
గాజా: చిరకాల ప్రత్యర్ధులు అయిన ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ప్రతీకార దాడులకు దిగింది. అయితే శనివారం పాలస్తీనా ముఠాలు తమ నగరాలపైకి రాకెట్లను ప్రయోగించడం వల్ల ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది.
సుమారు 250కిపైగా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ట్యాంకులు, యుద్ధవిమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వివరించింది. ఈ దాడుల్లో ఆరుగురు మిలిటెంట్లు సహా 16 మంది చనిపోయారు.
అసలు గొడవ చెలరేగడానికి కారణం ఏమిటంటే?
మిలిటెంట్లకు ఆయుధాలు అందకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ గాజా నగరాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో గాజా దిగ్బంధానికి వ్యతిరేకంగా శుక్రవారం అక్కడ భారీ నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో సరిహద్దు కంచె వద్ద కాపాలా ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ సైనికుల మీద పాలస్తీనా గన్‌మన్ ఒకరు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు చనిపోయాడు. ఇక ఇజ్రాయెల్ దీనికి ప్రతిగా వైమానిక దాడి చేయటంతో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు చనిపోయారు. మళ్ళీ పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తి చనిపోయాడని ఇజ్రాయెల్ తెలిపింది.
ఆ రాకెట్ దాడులకు ప్రతిగా ఆదివారం ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోని సుమారు 200 లక్ష్యాలపై దాడులు దిగింది. ఈ దాడుల్లో 16 మంది పాలస్తీనా వ్యక్తులు మరణించారు. ఇందులో ఆరుగురు తీవ్రవాదులు కూడా ఉన్నారు.
కాగా, ఇజ్రాయెల్-పాలస్తీనాలు గత నెలలో సంధికి అంగీకరించినప్పటికీ ఈ ఘర్షణ చెలరేగటం గమనార్హం. అయితే దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలనూ ఒప్పించాలని ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి.
చదవండి:భారత్‌వి అబద్ధాలు.. అసలు మా దేశంలో ఒక్క ఉగ్ర సంస్థ లేదు: పాక్ ఆర్మీ…








