అమెరికా: ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఫేస్‌బుక్‌లో జరిగే తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు ఆ సంస్థ కొత్త విధానాలను తీసుకువస్తుంది. ఓటుకు సంబంధించి తప్పుడు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అలాంటి నకిలీ పోస్టులను ఫేస్‌బుక్ నిషేధించింది.
‘ఓటు వేసే విధానం.. ఏ విధంగా ఓటు వేస్తే పరిగణనలోకి తీసుకుంటారు… ఎస్.ఎం.ఎస్. ద్వారా కూడా ఓటు వేయవచ్చంటూ నకిలీ ప్రచారం.. ’ అంటూ తెలిపే తప్పుడు వార్తలు ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నందున ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ అధికారి ఒకరు వెల్లడించారు.
‘‘ప్రజలు ఓటువేసే తీరును ప్రభావితం చేసేలా ఉన్న వ్యాఖ్యలు నిజం కాదని యూజర్లు భావిస్తే ఫేస్‌బుక్‌లో ఉన్న రిపోర్టింగ్ ఆప్షన్ ద్వారా మా దృష్టికి తీసుకురావచ్చు. వీటిపై సమీక్ష జరిపేందుకు మేం వాటిని థర్డ్ పార్టీ నిజ నిర్ధారణ బృందానికి పంపుతాం. ఒకవేళ అది నిజం కాదని తేలితే ఆ పోస్టు న్యూస్‌ఫీడ్‌లో చిట్టచివరికి వెళ్లిపోయి కనిపించకుండా పోతుంది.’’ అని ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ మేనేజర్ జెస్సికా లెన్‌వండ్ వివరించారు.
అమెరికాలో ఈ నవంబరులో మధ్యంతర ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఓటరు ప్రలోభలకు గురికాకుండా ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు 2016లోనే ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.