షాకింగ్‌ : ఐదు కోట్ల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌! ఆ ఫీచర్ అంత డేంజరా?

facebook
- Advertisement -

 

facebookశాన్‌ఫ్రాన్సిస్కో: తమ వినియోగదారుల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని ఫేస్‌బుక్‌ శుక్రవారం వెల్లడించింది. దాదాపు ఐదు కోట్ల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారు. ‘వ్యూ యాజ్‌’ ఫీచర్‌ సాంకేతిక లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అభిప్రాయపడింది.

facebook-viewas

ఇతరులకు మన ఖాతా ఎలా కనిపిస్తుందనేది చూసే వీలు కల్పించే ‘వ్యూ యాజ్‌’ అనే ఫీచర్‌లో ఈ లోపం ఉందని.. ఇది ‘ప్రైవసీ ఫీచర్‌’ అని మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.  ప్రస్తుతానికి  ఆ లోపాన్ని సరిచేసినప్పటికీ, ఆ ‘వ్యూ యాజ్‌’ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు  ప్రకటించారు.

‘‘ఈ  ఫేస్‌బుక్‌ డేటా దుర్వినియోగం జరిగిందా లేదా అనే ఇంకా స్పష్టత రాలేదు. మిగతా  ఫేస్‌బుక్‌ వినియోగదారుల అకౌంట్ల భద్రతా వ్యవస్థను పటిష్టం చేశాం. కొద్ది కాలంగా ఫేస్‌బుక్‌పై తరచూ హ్యాకర్ల దాడులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి  దాడులు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది..’’ అని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  వ్యాఖ్యానించారు.

ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్‌ అయిన విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం తొమ్మిది కోట్లకు పైగా ఫేస్‌బుక్‌ వినియోగదారులను అత్యవసరంగా తమ అకౌంట్లను లాగ్‌ఔట్‌ చేయాలని ఫేస్‌బుక్‌ సూచించింది. న్యూస్‌ ఫీడ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ హ్యాకింగ్‌ ఘటనపై అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియజేశామని కూడా ఫేస్‌బుక్‌ పేర్కొంది.

 మరోవైపు ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయనే  వార్తల నేపథ్యంలో  అమెరికా స్టాక్‌మార్కెట్లలో ఆ సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి.

- Advertisement -