12నే కిమ్‌తో భేటీ.. నిర్ధారించిన ట్రంప్, కిమ్ నుంచి సీల్డ్ కవర్, ఆ దేశ దౌత్యవేత్త రాకతో మారిన సీన్

- Advertisement -

వాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ఈ నెల 12న సింగపూర్‌లో తాను సమావేశమవనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ధారించారు. శనివారం వైట్‌హౌస్‌లో ఉత్తరకొరియా దౌత్యవేత్త కిమ్‌ యోంగ్‌ చోల్‌తో రెండు గంటల సమావేశం అనంతరం ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. అంతకుముందు చోల్‌ రెండు రోజులపాటు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోతో న్యూయార్క్‌లో చర్చలు జరిపారు.

తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్  పంపిన లేఖను ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అందజేశారు. వైట్‌హౌస్‌ నుంచి చోల్‌ వెళ్లిపోగానే ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘12న సింగపూర్‌ వెళ్తున్నా, సంబంధాలు బలపడుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. ఒక్క సమావేశంతోనే అంతా అయిపోతుందనను. అయితే, ఆ ఒక్క సమావేశంతోనే చాలా సానుకూల ఫలితం వస్తుందని భావిస్తున్నా..’ అని వ్యాఖ్యానించారు.

కిమ్‌తో భేటీ క్యాన్సిల్ అంటూ ఇటీవల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా  ఉత్తరకొరియా దౌత్యవేత్త, ఆ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కిమ్‌ యోంగ్‌ చోల్‌తో జరిగిన సమావేశం అనంతరం మళ్లీ ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంతకీ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తన లేఖలో ఏం రాశారో?  ఆ మాటే విలేకరులు అడిగితే ‘అబ్బే,. నేనింకా ఆ లేఖ చదవనేలేదు..’ అంటూ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.

- Advertisement -