బీజింగ్: నేటి యువత ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకూ స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు అతిగా స్మార్ట్‌ఫోన్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని.. సిగరెట్టు పెట్టెలపై చెప్పినట్టే చెబుతున్నా.. కాల్చేవాళ్లు కాల్చేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లు వాడేవారు వాడేస్తున్నారు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. కొంతమంది మాత్రం నిరంతరం స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే ఉంటున్నారు. తాజాగా.. ఓ మహిళ వారం రోజులు నాన్ స్టాప్‌గా స్మార్ట్‌ఫోన్ వాడటంతో ప్రస్తుతం ఆమె చేతి వేళ్లు పని చేయకుండా పోయాయి. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.
చైనాకు చెందిన షాంఘైలిస్ట్ కథనం ప్రకారం… హునాన్ ఫ్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయింది. తన ఉద్యోగానికి వారం రోజుల పాటు సెలవు పెట్టేసింది. ఈ ఖాళీ సమయంలో పూర్తిగా తన ఫోన్‌కు అంకితమైపోయింది. కేవలం నిద్ర పోయేటప్పుడు తప్ప మిగతా సమయమంతా ఫోన్‌తోనే గడిపేసింది. ఇంకేముంది..
కొన్ని రోజుల తర్వాత ఆమె కుడి చేతిలో తీవ్రమైన నొప్పి రావడమేకాక చేతి వేళ్ళు సడన్ గా బిగుసుకుపోయాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధంగా పట్టుకుని ఉందో అదే పొజిషన్‌లో ఆమె వేళ్లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని కొంచెం కూడా కదిలించడానికి రాకపోవడంతో సదరు మహిళ వెంటనే ఆసుపత్రికి పరుగుదీసింది.
ఆమెని పరీక్షించిన డాక్టర్లు సదరు మహిళ ‘టెనోసినోవిటీస్’ (రోజుల తరబడి చేతులను ఒకే విధంగా వాడటం వల్ల వచ్చే వాపు)తో బాధపడుతుందని తేల్చారు. అనంతరం వైద్యం చేసి ఆమె చేతి వేళ్లను యథాస్థితికి తీసుకొచ్చారు. అంతేకాక ఇకమీదటైనా స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించమని ఒక సలహా కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ మాట వినకపోతే.. ఇప్పుడు వాడిన మందుల డోస్ పెంచాల్సి ఉంటుందని, అప్పటికీ మానకపోతే.. కొత్త మందులు కనిపెట్టే వరకు.. వంకర తిరిగిన వేళ్లతో ఎదురుచూడాల్సిందేనని.. కామెంట్లు విసురుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈ కథనం వెలుగులోకి వచ్చింది.