షాపింగ్‌‌మాల్‌ పార్కింగ్‌లో కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం

Santa-Ana-Plane-Crash
- Advertisement -

santa-ana-flight-collapsed

వాషింగ్టన్: అమెరికాలోని ఓ షాపింగ్ మాల్ ముందు విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కాలిఫోర్నియాలోని  శాంటా అనా నగరంలో ఆదివారం (ఆగస్టు 5) నాడు ఈ దుర్ఘటన జరిగింది.  శాంటా అనాలోని ‘స్టాప్లెస్‌ సూపర్‌ సెంటర్‌ షాపింగ్‌ మాల్‌’ పార్కింగ్‌ స్థలంలో రెండు ఇంజిన్లు కలిగిన చిన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతూ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు.

ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) దర్యాప్తు చేపట్టింది.  ఎఫ్‌ఏఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. శాన్‌‌ఫ్రాన్సిస్కో కంపెనీ పేరుతో నమోదైన ఈ విమానం కాంకోర్డ్‌ సిటీ ఈస్ట్‌ బే సబర్బ్‌ నుంచి బయలుదేరి ఆరెంజ్‌ కౌంటీలోని జాన్‌ వేన్‌ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న షాపింగ్‌ మాల్‌ వద్ద కూలిపోయింది.  విమానం పైలట్‌ ఎమర్జెన్పీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ ఫలితం లభించలేదు.  చివరికి షాపింగ్‌ మాల్‌ పార్కింగ్‌ స్థలంలో విమానం కూలిపోయింది.
అయితే ఈ విమాన  ప్రమాదానికి దారితీసిన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. జాతీయ రవాణా భద్రత సంస్థ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -