22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం ‘అమ్మో’రికా: ఒక్కరోజులో దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు! అమెరికాలో అసలేం జరుగుతోంది?

‘అమ్మో’రికా: ఒక్కరోజులో దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు! అమెరికాలో అసలేం జరుగుతోంది?

30-thousand-cases-in-a-single-day-in-america
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. అక్కడ రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో బుధవారం 29,972 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 2,341 మంది మరణించారు. దీంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 47,700కి చేరుకోగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,50,000కు చేరింది.

తగ్గినట్లే తగ్గి మళ్లీ…

అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టాయి. గురువారం మరో 2,416 మంది వైర్‌సతో చనిపోయారు. దీంతో వరుసగా మూడో రోజూ 2 వేల మంది పైనే ప్రాణాలు కోల్పోయినట్లయింది. 

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘మనపై దాడి జరిగింది. ఇది కేవలం ఫ్లూ కాదు. 1917 తర్వాత ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు..’’ అని వ్యాఖ్యానించారంటే అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కరోనా నివారణకు భారీ ఆర్థిక ప్యాకేజీ…

మరోవైపు కరోనా సంక్షోభంతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు, కరోనా నివారణ చర్యల కోసం అగ్రరాజ్యం అమెరికా భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.

కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా 484 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తూ రూపొందించిన బిల్లును హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ గురువారం ఆమోదించింది.

కరోనా కల్లోలం కారణంగా ఆర్థికంగా నష్టపోయిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు, ఆసుత్రులలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని పేర్కొంది.

హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్ నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. గురువారం సాయంత్రం ఈ బిల్లుపై సంతకం చేసి చట్టంగా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

‘‘త్వరలోనే కోవిడ్‌-19కు వ్యాక్సిన్..’’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం శ్వేతసౌధంలో మాట్లాడుతూ 23 రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య కూడా తగ్గిందన్నారు.
 
అంతేకాదు, హ్యోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంలోని శాస్త్రవేత్తలు వైరస్‌పై ప్రయోగాలు చేస్తున్నారని, త్వరలోనే ఈ వైరస్‌ను చంపే వ్యాక్సిన్‌ కనుగొంటామని ఆయన పేర్కొన్నారు.
 
సురక్షిత మార్గాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించబోతున్నామని, ఇందుకు ప్రతి అమెరికా పౌరుడు సహకరించాలని చెప్పారు. 
 
వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే దేశాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాగలమంటూ ధైర్యాన్ని నింపారు.
 
 
- Advertisement -