మందు కొట్టి కారు నడుపుతూ అడ్డంగా బుక్కయిన నటి!?

gayathri-raghuram
- Advertisement -

చెన్నై: ప్రముఖ నటి, నృత్య కళాకారిణి, బిగ్ బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంకెన్ డ్రైవ్‌లో అడ్డంగా బుక్కయింది. ఈ విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న ఓ స్టార్ హోటల్‌లో సినీ సెలబ్రిటీలు పాల్గొన్న ఓ పార్టీకి వెళ్లిన ఆమె తిరిగి వస్తూ.. ఇలా ఇరుక్కుపోయింది. ఆ సమయంలో అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద మందు బాబుల కోసం తనిఖీలు చేపట్టారు.

అదే సమయంలో అటుగా వచ్చిన గాయత్రి కారును ఆపి, బ్రీత్ అనలైజర్‌లోకి గాలిని ఊదాలని వారు కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బ్రీత్ అనలైజర్‌లోకి గాలిని ఊదగా.. బీఏసీ 185 రావడం గమనార్హం.

మరోవైపు గాయత్రీ రఘురాంను కారులో చూడటంతో ఆ ప్రాంతమంతా ప్రజలు, అభిమానులతో నిండిపోయింది. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏదైనా మొబైల్ కోర్టులో ఆమె రూ. 3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని తెలిపారు.

గాయత్రీ రఘురామ్ ఏమంటున్నారంటే…

అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటూ గాయత్రీ రఘురామ్ కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటనపై సోమవారం ఆమె ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, వీటికంటే తనకు తన ఆత్మాభిమానం, జీవితం ముఖ్యమని చెప్పుకొచ్చారు.

‘‘నిజానికి జరిగిందేమిటంటే శనివారం రాత్రి షూటింగ్‌ ముగించుకుని సహ నటీనటులను వారి ఇంటికి చేర్చాను. తరువాత ఒంటరిగా కారులో మా ఇంటికి వెళ్లుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు సాధారణ తనిఖీలలో భాగంగా సోదాలు జరిపారు. అయితే నా డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతర పత్రాలు వేరు జేబులో ఉండిపోవడంతో వాటిని అప్పుడు పోలీసులకు చూపలేకపోయాను..’’ అని తెలిపారు.

అయినా నేను మద్యం మత్తులో ఉండి ఉంటే.. కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ ఇంటికెళ్లడానికి పోలీసులు ఎలా అనుమతిస్తారు? అని ఆమె ప్రశ్నించారు. ఏది ఏమైనా తన గురించి ఎలాంటి ప్రచారం జరిగినా భయపడేది లేదని గాయత్రీ రఘురామ్ పేర్కొన్నారు.


 

- Advertisement -