కశ్మీర్ అసెంబ్లీ రద్దు వివాదం: అవును, కేంద్రం ఒత్తిడి నిజమే.., బాంబు పేల్చిన గవర్నర్ సత్యపాల్ మలిక్!

jammu-kashmir-governor-satyapal-1
- Advertisement -

jammu-kashmir-governor-satyapal-malik

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ బాంబు పేల్చారు. గత వారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆ రాష్ట్ఱ అసెంబ్లీని రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఆయన.. అందుకు కేంద్రం ఒత్తిడి తీసుకురావడమే కారణమంటూ తాజాగా బాంబు పేల్చారు. తాను అసెంబ్లీని రద్దు చేసేముందు సజ్జాద్‌ లోన్‌ను సీఎంగా నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వం తనను కోరిందన్నారు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి తాను తలొగ్గి ఉంటే… ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా సజ్జాద్‌ను ఆహ్వానించాల్సి వచ్చేదన్నారు. ‘‘నేను ఢిల్లీ వైపు చూసి ఉంటే.. సజ్జాద్‌ లోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాల్సి వచ్చేది. అయితే నిజాయితీ లేని ఓ వ్యక్తిగా నేను చరిత్రలో మిగిలిపోదల్చుకోలేదు. ఇప్పుడు నామీద వస్తున్న నిందలపై ఎలాంటి బాధాలేదు…’’ అని సత్యపాల్ మలిక్ పేర్కొన్నారు.

గతవారం ఉన్నపళంగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేస్తున్నట్టు గవర్నర్ సత్యపాల్ మలిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమంటూ… పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముందుకొచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

గవర్నర్ సత్యపాల్ అకస్మిక నిర్ణయంపై అటు జమ్మూ కశ్మీర్‌లోనూ, ఇటు ఢిల్లీలోనూ ప్రత్యర్ధి పార్టీలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.

గవర్నర్ నిర్ణయం ‘‘అప్రజాస్వామికమనీ, రాజ్యాంగ విరుద్ధమని’’ ఆరోపిస్తూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోయగా.. రాష్ట్ర ప్రయోనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన సముచిత నిర్ణయమే తీసుకున్నారంటూ బీజేపీ గవర్నర్‌ను వెనకేసుకొచ్చింది.

- Advertisement -