విదేశంలో చంద్రబాబు.. స్వదేశంలో షాకిచ్చిన నేతలు! నలుగురు ఎంపీలు బీజేపీలోకి…

tdp-rajyasabha-mps-joined-in-bjp
- Advertisement -

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు. పార్టీ అధినేత యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో నలుగురు ఎంపీలు గరికపాటి మోహన్ రావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్.. టీడీపీకి వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో టీడీపీకి మొత్తం ఆరుగురు సభ్యులున్నారు. వీరు.. గరికపాటి మోహన్ రావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కనకమేడల రవీంద్రబాబు, సీతారామలక్ష్మి.

టీడీపీకి నలుగురు ఎంపీల గుడ్ బై…

ఇప్పుడు వీరిలో మొదటి నలుగురు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌లు.. వ్యూహాల మేర‌కే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సాంకేతిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు వీరు నలుగురు నేరుగా బీజేపీలో చేరకుండా, మొదట టీడీపీ రాజ్యసభా పక్షంలో చీలిక తీసుకొస్తున్నారు.

రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడును కలిసి ఒక లేఖ ఇచ్చారు. ఇందుకు వీరు టీడీపీ అధినేత చంద్రబాబు స్వదేశంలో లేకపోవడాన్ని తమకు అనువుగా మలచుకున్నారు.

ఈ మేరకు పార్టీ కార్యాల‌యం నుండి స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు విదేశం నుంచే ఈ నేత‌ల‌తో ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌టానికి ప్ర‌య‌త్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు బీజేపీలో చేర‌టం ఇక లాంఛ‌న‌మే అని అంటున్నారు.

బీజేపీలోకి జేపీ నడ్డా సాదర స్వాగతం…

మరోవైపు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లకు శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

కాలికి గాయమై బాధపడుతున్న మరో ఎంపీ గరికపాటి మోహన్ రావు చికిత్స తీసుకుంటున్న కారణంగా రాలేకపోయారు. అంతేకాదు, రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.

‘‘ఇక వీళ్లు బీజేపీ సభ్యులు..’’

ఈ సందర్భంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు నలుగురూ బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. ఇందుకు అమిత్ షా, మోడీలు కూడా సానుకూలంగా ఉన్నారు. శుక్రవారం ఉదయమే ఈ విషయమై చర్చించుకున్నాం.

తమ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని వారు కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి లేఖ కూడా ఇచ్చారు. దీంతో మేం కూడా టీడీఎల్పీని బీజేపీలో విలీనం చేసుకుంటున్నట్లు లేఖ ఇచ్చాం. ఇక వీళ్లు బీజేపీ సభ్యులు.. అని వ్యాఖ్యానించారు.

సుజనా చౌదరి ఏమన్నారంటే…

‘‘నేను మూడున్నరేళ్లపాటు కేంద్ర సహాయ మంత్రిగా ప్రధాని మోడీ నేతృత్వంలో పనిచేశాను. మొన్నటి ఎన్నికల ద్వారా ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలిసిందే. దీంతో మేం కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములం కావాలని నిర్ణయించుకున్నాం.

కొన్ని కారణాల వల్ల ఏపీ కూడా ఇబ్బంది పడింది. పోటీ పడడం, గొడవ పడడం ద్వారా అభివృద్ధి జరగదని అర్థమైంది. అందుకే మేం సమన్వయంతో పని చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటు ఏపీ అభివృద్ధికి, విభజన చట్టంలో చేసిన హామీల అమలుకు అవకాశం ఉంటుందనే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాం..’’

- Advertisement -