లోక్‌సభ ముందుకు మళ్లీ ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు…

6:34 pm, Fri, 21 June 19
triple-talaq-bill-in-lok-sabha-again

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ విపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చను ప్రారంభించారు.

గతంలో ఒకసారి ఈ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం లోక్‌సభలో దీనిని పాస్ చేయించుకున్నప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు పాస్ కాలేదు. ఈ బిల్లుకు పలు పార్టీలు సవరణలు కోరడం, అంతేకాకుండా రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం కొంత తక్కువ కావడంతో అక్కడ ఈ బిల్లు పెండింగ్‌లో పడిపోయింది.

గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో…

ఈలోగానే సార్వత్రిక ఎన్నికలు రావడంతో 16వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లు కూడా రద్దు అయింది. దీంతో గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ‘ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు, 2019’ ‌ను మళ్లీ ఈరోజు కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

అయితే ఈ ట్రిపుల్ తలాక్ బిల్లుపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించడమేకాక.. ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరగదని వ్యాఖ్యానించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ పట్టుబట్టారు. మరోవైపు ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడానికి ఇటు వైసీపీగానీ, అటు బిజూ జనతాదళ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

అయితే ఎన్డీఏతో మిత్రపక్షంగా ఉన్న జేడీ(యూ) మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లుపై తమ పార్టీ వెనక్కుతగ్గబోదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ ఈ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు ఎంతో మేలుజరుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. బీజేపీకి 102 మంది సభ్యులు ఉండగా, తాజాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు బీజేపీ బలం 106కు చేరింది. మరి ఈసారైనా ఈ బిల్లు రాజ్యసభలో నెగ్గి చట్టంగా మారుతుందేమో వేచి చూడాల్సిందే.