

హైదరాబాద్: బావంటే అక్క మొగుడు.. లేదా వరసకు మేనమామ.. ఇలా మొత్తానికి తెలుగు సంప్రదాయం ప్రకారం.. బావంటే.. సరదాగా సరసమాడతాడు.. ఫర్వాలేదు.. తప్పుకాదని.. దానిని బూతద్దంలో పెట్టి చూడవద్దని పెద్దల మాట. అయితే ఇక్కడ ఒక బావ.. భార్యతో విడిపోయి.. ఆమెపై ఉన్న కక్షను ఆమె చెల్లెలు.. అంటే మరదలిపై తీర్చుకున్నాడు.
మరదలి పేరుతో ఒక ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. అందులో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. అయితే అతడి బండారం బయటపడింది. దీంతో మరదలిని వేధిస్తున్న ఆ బావను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో హన్మాన్ ఫారం గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు.
ఎస్సై వెంకటేశ్వర్లు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన జంగ పెద్దారెడ్డి (32) హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఏపీఎస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గతంలో జీహెచ్‌ఎంసీలో తాత్కాలిక పద్ధతిన స్వీపరు సెక్షన్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించాడు.
ఎనిమిదేళ్ల కిందట.. నవీపేట మండలంలోని హన్మాన్ ఫారం గ్రామానికి చెందిన యువతితో ఇతనికి వివాహం జరిగింది. ఈ దంపతులకు 5 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. పెద్దారెడ్డి తన భార్యను తరచూ మానసికంగా వేధించడంతో నాలుగేళ్ళ క్రితం అతని భార్య హన్మాన్ ఫారంలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
భార్యపై కసి తీర్చుకోలేక…
ఈ క్రమంలో కక్షగట్టిన పెద్దారెడ్డి.. భార్యపై కసి తీర్చుకోలేక తన ప్రతాపాన్ని మరదలుపై చూపించాడు. మరదలు పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి అందులో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో గత ఏడాది నవంబరు 1న పెద్దారెడ్డిపై అతడి భార్య నవీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదే నెల 14న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన పెద్దా రెడ్డి ఇటీవల గ్రామానికి వచ్చి ఆ ఊరి పెద్దలను కలిసి తన భార్యను కాపురానికి పంపించాలని కోరాడు. దీనికి ఆమె అంగీకరించకపోగా గ్రామస్థులు సైతం పెద్దారెడ్డి వైఖరిని తప్పుబట్టారు.
మరదలి పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి…
దీంతో కోపం పెంచుకున్న అతను ఒక నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి అందులో గ్రామానికి చెందిన కొందరి ఫొటోలతో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టాడు. వారి ఫోన్ నంబర్లను సైతం పోస్టు చేశాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 28న పెద్దా రెడ్డి చిన్నమరదలు తన బావపై నవీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అలాగే పెద్దారెడ్డిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇటీవల పలువురు గ్రామస్థులు సైతం జిల్లా కేంద్రంలో సీపీ కార్తికేయను కలిసి విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసి నెలరోజులవుతున్నా ఇప్పటికీ నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ హన్మాన్ ఫారం గ్రామస్థులు నవీపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
నిందితుడ్ని పట్టుకోవాల్సిందేనంటూ…
విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని వెంటనే పట్టుకుంటామని ఆందోళనకారులను నచ్చజెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆందోళనకారులతో ఫోన్‌లో మాట్లాడి రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
మరో రెండు రోజుల్లో పెద్దారెడ్డిని కనుక పట్టుకోకపోతే తిరిగి మరొకసారి ఆందోళన చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా గ్రామస్థులు పోలీసు అధికారులను హెచ్చరించడం గమనార్హం.








