మహిళను హిప్నటైజ్ చేసి అత్యాచారం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్

- Advertisement -

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌కు చెందిన ఓ డెలివరీ బాయ్ ఓ మహిళను హిప్నటైజ్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీ సమీపంలో నోయిడాలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. నోయిడాకు చెందిన 43 ఏళ్ల మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమె అమెజాన్‌లో ఓ బాక్స్ ఆర్డర్ చేసింది. అయితే, ఆర్డర్ వచ్చిన తర్వాత విప్పి చూస్తే వచ్చిన ప్రొడక్ట్ ఆమెకు నచ్చలేదు. 

దీంతో ఆమె తనకొచ్చిన ప్రొడక్ట్‌ను తిరిగి పంపాలని నిర్ణయించుకుంది. రిటర్న్‌కు అప్లై చేసింది. దీంతో ఆమె ఇంటికి వచ్చిన అమెజాన్ డెలివరీ బాయ్  ఆమెకు వచ్చిన ఐదు బాక్స్‌లలో నాలుగింటిని మాత్రమే తీసుకెళ్తానని పట్టుబట్టాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.

అయినప్పటికీ అతడు వాటిని వెనక్కి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో ఆమె అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వెనక్కి వెళ్లాల్సిందిగా అమెజాన్ అధికారులు అతడిని ఆదేశించారు. మరో వ్యక్తిని పంపిస్తామని ఆమెకు నచ్చజెప్పారు. 

వెనక్కి వెళ్లిన డెలివరీ బాయ్ కాసేపటికే మళ్లీ వచ్చి మొత్తం బాక్స్‌లను తీసుకెళ్తానని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. మరో వ్యక్తి వస్తానన్నాడని అతడితో చెప్పింది. అతడితో మాట్లాడుతూనే ఆమె స్పృహ కోల్పోయింది.

ఆ తర్వాత కాసేపటికి కళ్లు తెరిచి చూసేసరికి ఆ డెలివరీ బాయ్ ప్యాంటు విప్పి తన ముందు నిలబడి ఉండడంతో షాకైంది. ఏం జరిగి ఉంటుందో అర్థమయ్యేసరికి ఆమెకు చెమటలు పట్టాయి. 

భయంతో ఆమె కేకలు వేయడంతో డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అమెజాన్ ప్రతినిధులు కూడా స్పందించారు. కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -