

హైదరాబాద్: ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, ఎన్నో హిట్ చిత్రాల్లో పూజారి పాత్రలతో మెప్పించిన డీఎస్ దీక్షితులు ఇకలేరు. గుండెపోటుతో ఆయన మరణించారు. హైదరాబాద్లోని నాచారంలో ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్ చిత్రీకరణ జరుగుతూ ఉండగా, అందులో నటిస్తున్న దీక్షితులుకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది.
యూనిట్ సభ్యులు వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ఆయన ప్రాణాలు విడిచారని వైద్యులు వెల్లడించారు. దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎంఏ డిగ్రీ పొందిన ఆయన, రేపల్లె జూనియర్ కళాశాలలో లెక్చరరుగా కూడా పని చేశారు.
‘ఇంద్ర’, ‘మురారి’, ‘అతడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో దీక్షితులు పూజారి పాత్రలను పోషించి మెప్పించారు. అక్కినేని నట విద్యాలయంలో పనిచేస్తూ, ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు.








