కమెడియన్ అలీకి ఎమ్మెల్సీ గిఫ్ట్! సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్?

2:14 pm, Fri, 12 July 19
tollywood-comedian-ali-ap-cm-ys-jagan

హైదరాబాద్: సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం, పదవులు పొందడం సాధారణంగా జరిగేదే. రాజకీయా పార్టీలు కూడా సినీ నటులను తమ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుంటాయి. అధికారంలోకి గనుక వస్తే.. ప్రచారం సమయంలో ఆయా నటులు అందించిన సేవలను బట్టి వారికి కొన్ని పదవులూ కట్టబెడుతుంటాయి.

ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే.. టాలీవుడ్ హాస్యనటుడు అలీ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో చేరి, ఆ పార్టీ తరుపున ప్రచారంలో సైతం పాల్గొన్నారు. దీంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. అలీకి ఏదో ఒక పోస్టు ఖాయం అని అందరూ భావించారు.

చదవండి: ఎట్టకేలకు ఎమ్మెల్యే రోజాను కీలక పదవిలో నియమించిన వైఎస్ జగన్

మరి ఆ ఘడియ కూడా రానే వచ్చింది. అటు తెలుగుదేశం, ఇటు జనసేనని కాదని తన పార్టీలో చేరిన అలీని ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సముచిత రీతిలో సత్కరించాలని అనుకున్నారేమోగానీ, త్వరలోనే కమెడియన్ అలీకి ఆయన ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టనున్నారని విశ్వసనీయ సమాచారం.

నిజానికి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగాలని, ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలనేది కమెడియన్ అలీ కోరిక. మొన్నటి ఏపీ ఎన్నికల్లో తన కోరికను నెరవేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం కూడా చేశారాయన. అయితే అటు తెలుగుదేశం, ఇటు జనసేన.. ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపుపై గట్టి హామీ ఇవ్వకపోవడంతో ఆయన చివరికి జగన్ పార్టీలో చేరారు.

అయితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా.. గెలిచి అధికారంలోకి వస్తే తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో వైఎస్ జగన్ ఆయనకు హామీ ఇచ్చారని, ఆ ప్రకారమే ఇప్పుడు అధికారంలోకి కూడా రావడంతో ఆ హామీని నెరవేర్చే పనిలో ఉన్నారని, ఫలితంగా అలీ త్వరలోనే ఎమ్మెల్సీ కాబోతున్నారని చెప్పుకుంటున్నారు.

చదవండి: సంచలనం: శ్రీదేవి మరణం ప్రమాదం కాదు.. హత్యే!: కేరళ జైళ్ల శాఖ డీజీపీ వెల్లడి…

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ ఇంతవరకు వెలువడలేదుగానీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే… అలీ మరికొద్దిరోజుల్లో ఎమ్మెల్సీ కావడం ఖాయమని, ముఖ్యమంత్రి జగన్ అలీకి ఇచ్చేందుకు ఎమ్మెల్సీ గిఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని సర్వత్రా చెప్పుకుంటున్నారు.