హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ అయితే సినిమా మీద అంచనాలని భారీగా పెంచేసింది. ఈ తరుణంలో సైరా సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. జాతిపిత గాంధీ జయంతి అయిన అక్టోబరు 2నే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది.
ఇక ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయిందని, చిరంజీవి డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలిపింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాగే ఇందులో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అమిత్ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నారు.








