
చెన్నై: నటి త్రిషను ఉద్దేశించి తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజకీయాల్లో ఉన్న పురుష నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం మహిళలను అనవసరంగా వివాదాల్లోకి లాగడం తక్షణమే మానేయాలని, కేవలం ప్రజా సమస్యలపైనే దృష్టి సారించాలని ఆమె హితవు పలికారు.
ఈ వివాదంపై చిన్మయి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు.
“ఉదయనిధి చేసిన వ్యాఖ్యల అంతరార్థం మొదట నాకు అర్థం కాలేదు. వేరే ఎవరో దాన్ని వివరించే వరకు అసలు విషయం నాకు బోధపడలేదు. నిజానికి చాలామంది మహిళలకు కూడా అది అర్థం కాలేదు. ఎందుకంటే అది కేవలం మగవారికి మాత్రమే అర్థమయ్యే ఒక సంకేతం (మగ మనస్తత్వానికి సంకేతం). సభలో తన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్న ప్రేక్షకులను అదుపు చేయాల్సింది పోయి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడే మరింత అభ్యంతరకరంగా మాట్లాడటం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది” అని పేర్కొన్నారు.
జయలలిత కాలం నాటి పోకడలే ఇంకానా?
గతంలో డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి వంటి వారు రాజకీయ వేదికలపై మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటానికి ఇటువంటి ప్రోత్సాహాలే కారణమని చిన్మయి ఆరోపించారు.
“గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి కూడా రాజకీయ వేదికలపై ఇదే తరహాలో నీచంగా మాట్లాడేవారు. పాత తరం నేతల పోకడలు ఎలా ఉన్నా, కనీసం యువ తరం నేతలైనా హుందాగా, గౌరవంగా వ్యవహరిస్తారని ఆశిస్తాం. కానీ ఈనాటి యువ నాయకుల ప్రవర్తన కూడా అంతకంటే దారుణంగా ఉండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, ఇలాంటి సంస్కృతిపై మహిళలు కూడా గట్టిగా స్పందించకపోవడం విచారకరమని ఆమె అభిప్రాయపడ్డారు.








