

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. ఆయన మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కోడి రామకృష్ణ మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
ఎన్నో విజయవంతమైన చిత్రాలు
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. సినీరంగంలో ఆయనది 30 ఏళ్ల ప్రస్థానం. ఆయన 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక.. ఏకంగా 525 రోజులు ఆడటం విశేషం.
ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మంగమ్మగారి మనవడు’, ‘ఆహుతి’, ‘శత్రువు’, ‘అమ్మోరు’, ‘ముద్దుల మావయ్య’, ‘మా ఆవిడ కలెక్టర్’, ‘పెళ్లి’, ‘దొంగాట’, ‘అంజి’, ‘దేవీపుత్రుడు’, ‘దేవి’, ‘దేవుళ్లు’ ‘అరుంధతి’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ప్రముఖ నటులు అర్జున్, భానుచందర్, సుమన్‌లను కోడి రామకృష్ణ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం ఆయనకు లభించింది. 10 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు కోడి రామకృష్ణ అందుకున్నారు. ‘శత్రువు’ చిత్రానికి ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అంతేగాక, నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించారు.
Extremely saddened by the news of director Kodi Ramakrishna garu’s demise. His contribution to Telugu Cinema is unparalleled, our industry will never forget his work. My thoughts & prayers are with his closed ones… May his soul rest in peace!
— Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2019








