గాయని సునీతకు చేదు అనుభవం, అనుమతి లేదంటూ సంగీత విభావరిని అడ్డుకున్న పోలీసులు!

singer-sunitha
- Advertisement -

singer-sunitha-in-srikakulam

శ్రీకాకుళం: సినీ నేపథ్య గాయని సునీతకు గురువారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని వైఎస్సార్‌ కూడలిలో ఉన్న నగరపాలక సంస్థ మైదానంలో పర్యాటకశాఖ నేతృత్వంలో గాయని సునీత గీతాలాపన కార్యక్రమం ఏర్పాటైంది. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా అనుమతి తీసుకోలేదంటూ స్థానిక పోలీసులు అడ్డుకున్నారు.

టూరిజం శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ఓ నిర్వాహకుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే పెద్దగా ప్రచారం చేయకపోవడంతో ఈ కార్యక్రమానికి జనం కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు. దీనికితోడు పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో.. అప్పటికప్పుడు అనుమతి కోసం నిర్వాహకులు పరుగులుపెట్టారు. దీంతో సంగీత విభావరి ఆలస్యంగా ప్రారంభమైంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు…

పోలీసులు జోక్యం చేసుకొని కార్యక్రమాన్నిఆపివేసిన తర్వాత టూరిజం అధికారి నారాయణరావు జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి అనుమతి కోరారు. ఆయన అనుమతి ఇచ్చేసరికి రాత్రి 8 గంటల సమయం దాటింది. మరోవైపు నగరపాలక సంస్థ మైదానంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని గతంలో పాలకవర్గం తీర్మానం చేసింది. దీంతో మూడేళ్లపాటు ఎటువంటి అధికారిక, అనధికారిక, ప్రైవేటు కార్యక్రమాలు జరగలేదు.

గతేడాది పీఎస్‌ఎన్‌ఎంహెచ్‌ స్కూల్‌ ఆవరణలో ఓ వాణిజ్య ప్రదర్శన నిర్వహిస్తుండగానే మరో వాణిజ్య ప్రదర్శనకు అనుమతి ఇచ్చి ఈ మైదానాన్ని కూడా కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

అప్పట్లో ఈ మైదానాన్ని వాణిజ్య ప్రదర్శనకు కేటాయించారు. ఆనాటి నుంచి కౌన్సిల్‌ తీర్మానాన్ని సైతం తుంగలోకి తొక్కినట్లయింది. ఇప్పుడు మరో ప్రైవేటు కార్యక్రమానికి ఈ మైదానాన్ని కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.

సంగీత విభావరి విషయానికే వస్తే… కార్యక్రమానికి ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించే ఈ నిర్వాహకులు శ్రీకాకుళంలో ఎందుకు తీసుకోలేదనేది ప్రశ్న. తెలిసీ నిర్వాహకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో అర్థం కాని విషయం.

 

- Advertisement -