‘మాగుంట’ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు.. మూడో రోజూ కొనసాగుతున్న సోదాలు!

it-raides-on-tdp-mlc-magunta-office
- Advertisement -

it-raides-on-tdp-mlc-magunta-office-1

ఒంగోలు: మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై మూడో రోజైన ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. ఆయన ఆదాయం, సమర్పించిన ఐటీ రిటర్నుల మధ్య వ్యత్యాసం ఉండడంతో ఐటీ శాఖ అధికారులు ఈ మేరకు మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు.

శుక్ర, శనివారాల్లో చెన్నైలోని మాగుంట ‘బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’కు చెందిన కార్యాలయలు, అలాగే శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఇళ్లపైనా దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు రూ.55 కోట్ల నగదుతోపాటు భారీ మొత్తంలో బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు.

బాలాజీ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలతో పాటు 13 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని మాగుంట గ్రూపు సంస్థల వ్యాపార లావాదేవీలన్నీ చెన్నై బజుల్లా రోడ్డులోని ప్రధాన కార్యాయం ద్వారానే సాగుతుంటాయి. ఈ దాడులలో భాగంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన పలు కంపెనీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్, డ్రైవ్‌లను ఆదాయపన్ను శాఖ అధికారులు జప్తు చేశారు.

చెన్నై టీనగర్‌లోని మాగుంట గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం, పూందమల్లెలోని ఫ్యాక్టరీ, శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

వాటికి కొనసాగింపేనా?

గత నెల 30వ తేదీన రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చెన్నైలోని ఒక స్టార్‌ హోటల్‌పై నిఘా పెట్టి 7 కిలోల విదేశీ బంగారు బిస్కెట్లు, రూ.16 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సంబంధం ఉన్న కొరియా దేశానికి చెందిన ఇద్దరు యువతులను, చెన్నైకి చెందిన హవాలా వ్యాపారిని కూడా అరెస్ట్‌ చేశారు. వాటికి కొనసాగింపుగానే ఇప్పుడు ‘మాగుంట’ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులకు దిగడంతో నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాల్లోనూ అలజడి రేగింది. మాగుంట అనుచరులతో పాటు ఆయా కంపెనీలు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు.

ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో వారు అప్రమత్తమయ్యారు. అయితే ప్రస్తుతానికి చెన్నైలోని మాగుంట కంపెనీలు, కార్యాలయాలపైనే ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

అధికార పార్టీ నేతల్లో బెంబేలు…

ఇటీవలే ఒంగోలు జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీ ఫుడ్స్, ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపైనా ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంత నగదుతో పాటు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇంతలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీలు, నివాసాలపైన ఐటీ దాడులకు దిగడంతో అధికార పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు.

- Advertisement -