
విశాఖపట్నం: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తాను ఆయన భక్తుల జాబితాలో ఉన్నానని, ఆశ్రమానికి వస్తున్నానని చెప్పడంపై సినీ గాయని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏనాడూ స్వరూపానంద సరస్వతి ఆశ్రమానికి వెళ్లలేదని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు.
స్వరూపానంద ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చిరంజీవి, రజనీకాంత్ తనవద్దకు వస్తుంటారని, అలానే రాజేంద్రప్రసాద్ అబ్బాయి కూడా తన దగ్గరకు తరచుగా వస్తుంటారన్నారు. వీరితో పాటు సింగర్ సునీత.. వీళ్లు వాళ్లు వస్తుంటారని.. తాను ఉన్నది ఫిల్మ్ నగర్ కాబట్టి.. సెలబ్రిటీలు వస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక స్వరూపానంద ఇంటర్వ్యూ చూసిన సునీత ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ.. రోజూ ఎన్నో వదంతులు వినిపిస్తుంటాయని, అయితే, కొన్నింటిపైనే స్పందించాల్సిన అవసరం వస్తుందని అన్నారు.
ప్రముఖ వ్యక్తి స్వరూపానందేంద్ర సరస్వతిని సందర్శించే వారి జాబితాలో ఆయన తన పేరును చేర్చడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.








