‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథలో కొత్తకోణం! మరి ఆర్జీవి దృష్టిలో ఉందా?

1:39 pm, Tue, 19 March 19
Lakshmi's NTR Movie News, Ram Gopal Varma Latest News, Newsxpressonline

ఆర్జీవీ అడిగినవాళ్లు, లేదా ఆయనకు చెప్పినవాళ్లు మరీ సంగతులు చెప్పారా? ఇంతకుముందు తీసిన రక్తచరిత్ర, వంగవీటి సినిమాలన్నీ నిజాలతోనే నిండి ఉన్నయా? తనెప్పుడూ ఫెయిర్ కానని చెప్పే రాంగోపాల్ వర్మ.. సినిమా ఫెయిర్ గానే తీశాడని నమ్మగలమా? మరేమిటా లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలు సంగతులు? ఒకసారి చూద్దాం..

అది 1989వ సంవత్సరం..

ఎన్టీఆర్ తెలుగుదేశం అధికారం కోల్పోయింది. కుటుంబ సభ్యులు దాదాపు ఆయనను పట్టించుకోలేదనే చెప్పాలి. అంటే ఆయన చాలా పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో మెలిగే వ్యక్తి..అలాగే ఆయనతో మాట్లాడలంటే అందరికీ భయం..భక్తి, గౌరవం..దాంతో ఎవరూ  కూడా పులి నోట్లో తల పెట్టడం ఎందుకని..ఇంటి ఛాయలకు వెళ్లేవారు కాదని కొందరి సన్నిహితుల మాట..

ఈ సమయంలో లక్ష్మీపార్వతి సన్నిహితం కావడం, అది వివాస్పదమవడంతో..చివరికి ఆమెను వివాహం చేసుకొని..అలా అందరి నోళ్లు మూయించాను అని ఎన్టీఆర్ అనుకున్నారు.. ఇది జరిగిన విషయం..కానీ కథ మరోలా మలుపు తిరిగింది..

అది 1994వ సంవత్సరం..

మళ్లీ ఎన్నికలు వచ్చాయి..తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అంటే లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాకే..పార్టీ అధికారంలో వచ్చింది. అంటే తెలుగు ప్రజలు ఆయన వివాహాన్ని అంగీకరించారు.

 కానీ ఒకరోజు..

తెలంగాణలోని ఒక ప్రధాన నాయకుడు..అంటే తెలుగుదేశం పార్టీలో ఆరోజుల్లో తెలంగాణ ప్రాంతానికి పార్టీలో నంబర్ వన్  నాయకుడు అనాలి..అయితే నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు..దేవేందర్ రెడ్డి కాదు..నల్గొండ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ నేత.. నిజానికి ఆంధ్రా-తెలంగాణ ఫీలింగు 1954నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి ఉంది.

ఇదే విషయం ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా చెప్పి..ఎలాగూ ఆనాటి ఉమ్మడి మెడ్రాస్ నుంచి విడిపోతున్నారు కదా.. రెండు తెలుగు రాష్ట్రాలుగా వెళ్లిపోండి.. ఆంధ్రాకు రాజధానికి కర్నూలు, తెలంగాణకు వరంగల్ పెట్టుకోమని సలహా చెబితే..ఆనాటి పెద్దలు.. ఇది కావాలని నెహ్రూ విభజనకు అడ్డం పెడుతున్నాడు..

ముందు మనం తమిళనాట నుంచి బయటకువస్తే..తర్వాత చూసుకుందామని ఐదుగురు పెద్దలు ఒక గదిలో కూర్చుని..రాతపోతల్లేకుండా పెద్దమనుషుల ఒప్పందం చేసుకొని..నెహ్రూ సలహాను పట్టించుకోకుండా బయటకొచ్చారు. ఈ ఆంధ్రా తెలంగాణ సమస్య ఈనాటిదికాదనేది అర్థమవుతోంది.

ఎన్టీఆర్ కథలో ఈ సంఘటనకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది.. అదేమిటంటే..

ఒకరోజు ఆ తెలంగాణ నల్గొండ జిల్లా తెలుగుదేశం ప్రముఖ నేత ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. నిజానికి కొంతమంది పార్టీ ప్రముఖులకి మాత్రం ఎన్టీఆర్ ఇంట్లోకి వెళ్లే చొరవ ఉండేది. ఎందుకంటే ఆయన సింగిల్ గా ఉండేవారు..ఉంటే అధికారులు ఉండేవారు..లేదంటే పనివాళ్లుండేవారు.

డైరెక్టుగా వెళ్లే చొరవ, ధైర్యం ఉన్న అతి తక్కువ మందిలో ఈయన ఒకరు.. కానీ అతనికి ఊహించని పరిణామం.. ఎన్టీఆర్ అప్పాయింట్ మెంట్ దొరకలేదు. ఆయన అక్కడ హర్ట్ అయ్యాడు. అదే తొలిబీజం అక్కడే పడింది. బయట వెయిటింగ్ రూమ్ లో చాలాసేపు ఎదురుచూశారు..కొన్ని గంటలు చూశారు. పిలుపు రాలేదు..

అప్పటికే చాలామంది చిన్నా, పెద్దా నేతలందరూ అక్కడికి వస్తున్నారు. వారందరూ ఏమిటి? మీరిక్కడ అని అడుగుతున్నారు..ఆశ్చర్యపోతున్నారు. కాలం మారింది..అని అంటున్నారు. ఆయన తట్టుకోలేకపోతున్నారు. క్షణక్షణానికి అవమానభారం పెరిగిపోతోంది. ఇంతలో ఊహించని ఒక సంఘటన జరిగింది.

ఈయనకన్నా చాలా చిన్నాపాటి స్థాయి ఉన్న ఎమ్మెల్యే..ఇతని ముందు చేతులు కట్టుకొని నిలబడే ఎమ్మెల్యే ఒకరు వచ్చీరాగానే లోపలికి పిలుపు వచ్చింది. పోతూపోతూ పుండుమీద కారం జల్లినట్టు..నేను లోపలికెళ్లి మేడమ్ గారికి చెబుతాను సార్..అన్నాడు.. అప్పుడొచ్చింది అందరికీ సందేహం..

ఈ మేడమ్ ఎవరు? ఏమిటి ఈవిడ పెత్తనం..? ఏమిటీ ఈవిడ అధికారం.. అని ఆలోచిస్తుండగానే మరొక ఎమ్మెల్యే లోనికి వెళ్లిపోయాడు..అక్కడ సీనియర్ నేతకు మరొక విషయం అర్థమైంది..ఏమిటంటే..

అక్కడ మరొక గ్రూప్ రెడీ అవుతోంది..

ఆ విషయం అర్థం కాగానే విసవిసా నడుచుకుంటూ బయటకు వచ్చేశాడు. సరాసరి నాటి మంత్రి చంద్రబాబునాయుడు దగ్గరికెళ్లి.. నేను పార్టీ నుంచి బయటకు వెళుతున్నాను..నాతోపాటు చాలామందిని అంటే మా తెలంగాణ ప్రాంతం వాళ్లని తీసుకెళ్లిపోతాను..పార్టీ ముక్కలైపోతుంది..

నేను క్లారిటీగానే ఉన్నాను..నీవు ఏదొకటి చెబితే..నేనా ప్రకారం చేస్తానని అల్టిమేటం ఇచ్చి వెళ్లిపోయాడు..అలా పార్టీలో ముసలం బయలుదేరింది. అయితే అప్పటికి చంద్రబాబునాయుడికి లక్ష్మీపార్వతితో విభేదాలేమీ లేవు. ఎన్టీఆర్ దగ్గరకెళ్లడం.. ఫైల్స్ పై సంతకాలు చేయించుకోవడం వెళ్లిపోవడం..ఏమైనా ఉంటే ఆమెకు సర్ధి చెబుదామనే భావనే ఉండేది..

ఎప్పుడైతే పార్టీలో ముసలం బయలుదేరిందో..ఒక నడిపించే నాయకుడు కావాలి. అప్పటికి ఎన్టీఆర్ కొడుకులెవరూ రాజకీయాల్లో లేరు..వారికి ఇష్టమూ లేదు..ఆసక్తి లేదు..అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని.. చంద్రబాబునాయుడిని ముందుకు నెట్టారు.

ఈ క్రమంలో ఈరోజున ఎన్టీఆర్ పిల్లల్లో కొందరు రాజకీయాల్లో ఉన్నారు. ఆ ముందుకు నెట్టిన వారే..ఈరోజు చంద్రబాబుని విమర్శించడం రాజకీయ పరాకాష్టకు నిదర్శనం. అందరూ ఒక్కటి ఆలోచించాలి.. ఎన్టీఆర్ కుటుంబం, ఆ కుమారులు, కుమార్తెల సపోర్ట్ లేకుండా ఒక్క చంద్రబాబు ఈ పని చేయగలరా? అలా పార్టీని నిలబెట్టడంలో రకరకాల ప్రయత్నాలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల మధ్య.. పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు.

చివరిగా ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి..వాటన్నింటినీ ఆయనే ఆ ఇంటిపెద్దలా ఉండి పరిష్కరించారు. వాటిలో ఆ కుటుంబంలో ఒక ప్రముఖ వ్యక్తి కోసం..ఆయన తన ఈగోని పక్కనపెట్టి అప్పటికి ప్రధాన ప్రతిపక్షనేత అధికారంలో ఉంటే అతని వద్దకు కూడా వెళ్లి రిక్వెస్ట్ చేయడం..

రాష్ట్ర ప్రజలెవరూ మరిచిపోరు.. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రముఖ కుర్రహీరోల్లో ఒకరికి..మంచి సంబంధం చూసి తనే దగ్గరుండి వివాహం చేయడంతో అతను కోట్లాదిరూపాయల ఆస్తులకి వారసుడిగా మారిపోయాడు. ఇలా ఒకటి కాదు..ఇప్పటికి పార్టీ పగ్గాలు ఒక్కటే ముఖ్యమంత్రి చేతికి వచ్చాయి తప్ప..

ఆ కుటుంబ పెద్దగా ఇప్పటికీ అన్నీ తానై ఉండి చేయడం ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కింది.. అయితే ఒక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో.. ఎన్టీఆర్ చిత్రంలో ఆ నాలుగున్నరేళ్ల కాలంలో ఉన్న డార్కెస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో అదే నేను తీస్తున్నా..ఆరోజున నేను లేను..కానీ నాకు తెలిసిన వాళ్లు చెప్పారు..

అలాగే ఎన్టీఆర్ కి సన్నిహితులతో మాట్లాడాను.. మీడియా మిత్రులతో మాట్లాడాను..అని వివరణలిస్తున్న రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రక్తచరిత్ర పార్ట్ 1, పార్ట్ 2.. వంగవీటి తదితర చిత్రాలు చూసిన వారు.. అక్కడ జరిగినదొకటి..యన తీసినదొకటి..అని అందరూ అనుకోవడం తెలిసిందే..  నాకేం విలువల్లేవు.. అని బహిరంగంగా చెప్పే రాంగోపాల్ వర్మ..నిజంగానే నిజాయితీతో ఈ సినిమా తీశాడని చెప్పగలమా?

మరెందుకు ధైర్యంగా తీశారని ప్రతి ఒక్కరూ చెబుతారు.. ఇప్పుడు వస్తున్నలక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా ఆ సమయంలోనే జరిగిన కొన్ని సంఘటనలను కావాలని పక్కనపెట్టారా? లేదంటే ఎన్టీఆర్ ను బదనాం చేయడానికే సినిమా తీస్తున్నారా? లేదంటే ఎన్నికల కాలంలో వస్తున్న సినిమా కాబట్టి.. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించడానికే తీస్తున్నారా?అన్నది విజ్నులైన ప్రేక్షకులు, ప్రజలకే తెలియాలి..

– శ్రీనివాస్ మిర్తిపాటి