హైదరాబాద్: వీ6 చానల్‌లో ‘తీన్మార్’ అనే కార్యక్రమంతో అందరినీ అలరించిన బిత్తిరి సత్తి వెండితెరపై కథానాయికుడిగా పరిచయం అవుతున్నాడు. రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ నిర్మాణ సారథ్యంలో ‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తుపాకి రాముడు’ సినిమాలో బిత్తిరి సత్తి హీరోగా నటిస్తున్నాడు.
ఇటీవల ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో సత్తి తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడని అన్నారు. యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని దర్శకుడు టి. ప్రభాకర్ తెలిపారు.
ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇన్నాళ్లూ బుల్లితెరపై బిత్తిరి సత్తిని చూసిన ప్రేక్షకులు త్వరలోనే ‘తుపాకి రాముడు’గా వెండితెరపై చూడనున్నారు.
చిత్ర తారాగణం..
ప్రియ, ఆర్.ఎస్.నందా, గౌతంరాజు, రవి, ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్ పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా సురేందర్‌రెడ్డి ఉన్నారు. మాటలు: సిద్దార్థ, రవి ఆదేష్, ఎడిటింగ్: జె.పి, పాటలు: అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, నిర్మాత: రసమయి బాలకిషన్, రచన, సంగీతం,దర్శకత్వం: టి.ప్రభాకర్.