దోచుకోవాలంటే.. నువ్వు సరిపోవు! ‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ

- Advertisement -

nannu-dochukonduvate

వర్కో హాలిక్ అయిన  కార్తీక్ (సుధీర్ బాబు) కు అమెరికా వెళ్లాలనేది యాంబిషన్. అందుకోసం తన క్రిందవాళ్లతో స్ట్రిక్టుగా పనిచేయిస్తూ తన సాప్ట్ వేర్ కంపెనీకి ఓ మాల స్ధంబంలా మారతాడు. అతనికి మేనమాన కూతరు సత్య(వర్షిణి)ని ఇచ్చి పెళ్లి చేయాలని ఇంట్లోవాళ్లు ప్లాన్ చేస్తారు. ఈ లోగా వర్షిణి వచ్చి తను వేరే ఓ కుర్రాడిని ప్రేమించానని, తను ఆ విషయం ఇంట్లో చెప్పలేనని, ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో పెళ్లి తప్పించుకోవటం కోసం ..తను సిరి అనే తన ఆఫీస్ లో పనిచేసే  అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అబద్దం ఆడతాడు.

దాంతో అతని తండ్రి (నాజర్) తను ఓ సారి సిరిని కలసి మాట్లాడాలని ఉందని అంటాడు. అప్పుడు వేరే దారి లేక అప్పటికప్పుడు సిరి అనే పాత్రను ఎంటర్ చెయ్యాలని డిసైడ్ అయ్యి..తన స్నేహితుడు సహాయంతో…షార్ట్ ఫిల్మ్ లలో హీరోయిన్ గా చేసే మేఘ‌న (న‌భా న‌టేష్‌)  ని సీన్ లోకి తీసుకు వస్తాడు.  ఆమె తన నటనతో  కార్తీక్ తండ్రిని ఇంప్రెస్ చేసేస్తుంది. అయితే ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది.

తనకి ఆ అమ్మాయి నచ్చటంతో … తన ఇంటి కోడలకు తెచ్చుకోవాలని కార్తీక్ తండ్రి ఫిక్స్ అయ్యిపోతాడు. అయితే ఈ సారి మేఘన సహకరిస్తుందా… కార్తిక్, మేఘన మధ్యన ప్రేమ ఎలా మొదలైంది. అసలు ఈ నాటకం ఎక్కడికి దారి తీసింది. ఎలా కార్తీక్, మేఘనలు ఒక్కటయ్యారు అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.

ఎక్కడో మొదలై.. ఇంకెక్కడికో వెళ్లి…

రీసెంట్ గా సమ్మోహనంలో సినీ హీరోయిన్ తో ప్రేమలో పడి , ఆ ప్రేమను గెలుచుకునేందుకు కృషి చేసిన సుధీర్ బాబు ..ఈసారి … షార్ట్ ఫిలిం హీరోయిన్ తో ప్రేమలో పడి , ఆ ప్రేమలో సక్సెస్ అయ్యేందుకు చేసే కృషి గా ఈ చిత్రం తెరకెక్కింది.  అయితే ఈ సినిమా ప్రారంభంలోనే దారి తప్పినట్లు అనిపిస్తుంది.

సాప్ట్ వేర్ కంపెనీ మేనేజర్ అయిన కార్తీక్ …ఓ అమ్మాయిని తీసుకువచ్చి   తన గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేసిన తర్వాత వచ్చే సమస్యలు ఏమిటనేవి ఊహించడా.. ఊహిస్తే ఆ గర్ల్ ఫ్రెండ్ పాత్రకు ముగింపు అనుకోడా..అలాంటిదేమీ కనపడదు. కేవలం ఆ క్షణానికి సమస్య పరిష్కారం అయితే చాలు అనుకున్నట్లుగా డిజైన్ చేశారు.

హీరో  తండ్రేమి చావటానికి సిద్దంగా ఉన్నవాడు కాదు కదా…ఓ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను అని చెప్తే …అది నమ్మి ఆయన ప్రశాంతంగా మరణిస్తే…తన నాటకం అక్కడితో ముగించవచ్చు అనుకోవటానికి. ఆ అమ్మాయి వచ్చి ఇంప్రెస్ చేసేసిన తర్వాత తండ్రి పెళ్లి చేసుకోరా అని అడిగితే ఏం చెప్దామనకుున్నాడు.. బ్రేకప్ అయ్యాను అని చెప్దామనుకున్నాడా…. ఏం ప్లాన్ చేసాడు..అదేమీ  మనకు చెప్పడు.

కామెడీ సినిమాల్లో అప్పటికప్పుడు ఓ పాత్రను తీసుకువచ్చి తన తల్లి, తండ్రి అని పరిచయం చేసినట్లు తన గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేసేయటం..అదే కథ అవ్వటం అనేది డ్రామా పుట్టించని అంశం.  అక్కడే క్యారక్టరైజేషన్ మిస్ అయ్యింది. రొమాంటిక్ కామెడీలకు క్యారక్టరైజేషనే కదా ప్రధానం. ఆ అమ్మాయి కూడా నటించమంటే జీవించేసి..ఈ కుర్రాడుతో ప్రేమలో పడిపోవటం కూడా అతికినట్లు ఉంటుంది కానీ మనకు ఫీల్ రాదు.

పోనీ అలా మొదలైన హీరో,హీరోయిన్  కథ ఆ తర్వాత ఏ కారణం చేత విడిపోయారు. ఏ కారణం చేత కలిసారు అన్న యాంగిల్ లో వెళ్లకుండా తండ్రి,కొడుకుల మధ్య సంభాషణతో క్లైమాక్స్ తీసుకువచ్చి ముగింపు ఇచ్చారు.  రొటీన్ గా ఉన్నా…రొమాంటిక్ కామెడీని అదే పద్దతిలో అంటే వాళ్లిద్దరూ విడిపోయాక తమ ప్రేమను రియలైజ్ అయ్యి..ఒకరినొకరు కలవాలని తహతహలాడటం పెట్టుకుని ఉంటే సబబుగా ఉండేది.

కొత్త డైరెక్టర్ ఎలా చేశాడంటే..

ఈ విషయాలన్ని ప్రక్కన పెడితే కొత్త డైరక్టర్ మాత్రం సెన్సిబుల్ కామెడీని బాగా పండించగలడని, సెంటిమెంట్ సీన్స్ ని  కూడా అదే స్దాయిలో నడిపించగలడని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. సరైన కథ ఎంచుకుంటే మంచి హిట్ కొట్టగలడని అనిపించింది. మిగతా డిపార్టమెంట్స్ అన్నిటిని సమర్దవంతంగా వినియోగించుకున్నాడు. అయితే రొమాంటిక్ కామెడీ కథలకు పాటలు ప్రాణం. ఆ విషయం దర్శకుడు ఎందుకనో మర్చిపోయాడు.  సుధీర్ బాబు..సినిమా సినిమాకీ నటనా పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు. కాకపోతే ఆ ప్రాసెస్ చాలా స్లోగా ఉంది.

చెప్పుకోదగ్గ అంశం…

ఈ సినిమాలో  హీరోయిన్ గా చేసిన అమ్మాయి మాత్రం చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి చాలా సీన్స్ కు ప్రాణం పోసింది. డల్ గా ఉన్న మూవ్ మెంట్స్ ని  కూడా తన నటనతో లేపింది. షార్ట్ ఫిలిం హీరోయిన్ గా ఆమె చెప్పే డైలాగులు, ఎక్సప్రెషన్స్ నవ్విస్దాయి.

ఫైనల్ థాట్…

ప్రేక్షకుల మనస్సు దోచుకోవాలంటే స్కెచ్ పర్‌ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్లు అన్ని జాగ్రత్తలతో థియేటర్‌కు వస్తున్నారు. 

నటీనటులు: సుధీర్‌బాబు, న‌భా న‌టేష్‌, నాజర్‌, తులసి తదితరులు
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
సంస్థ: సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌
కూర్పు: చోటా కే ప్రసాద్‌
కొరియోగ్రాఫర్‌: రాజ్‌కృష్ణ
నిర్మాత: సుధీర్‌బాబు
దర్శకత్వం: ఆర్.‌ఎస్‌. నాయుడు
విడుదల తేదీ: 21-09-2018

josyula surya prakash

-సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -