భీమవరంలో ప్రభాస్ అభిమానుల విధ్వంసం.. సినిమా బాగోలేదని థియేటర్‌పై దాడి!

11:15 am, Sat, 31 August 19

హైదరాబాద్: ‘బాహుబలి’ హీరో ప్రభాస్‌‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ అభిమానుల గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాలి. వారికి నచ్చితే తమ అభిమాన హీరోను ఏ రేంజ్‌కు ఎత్తేస్తారంటే.. ఏకంగా పోస్టర్లు పెట్టి, అభిషేకాలు కూడా చేసేస్తారు.

అదే తమ అభిమాన హీరోపై కాస్త కోపం వచ్చినా ఉగ్రరూపం చూపించేస్తారు. తాజాగా టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ కూడా అదే చేశారు. తమ అభిమాన నటుడు నటించిన లేటెస్ట్ మూవీ బాగోలేదంటూ వారు ఫైర్ అయ్యారు. ఆ సినిమా ఆడుతున్న థియేటర్‌లో ఫర్నీచర్ విరగ్గొట్టి మరీ విధ్వంసం సృష్టించారు.

సినిమా బాగోలేదనే కోపంతో…

ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సినిమా బాగోలేదనే కోపంతో భీమవరంలోని ఓ థియేటర్‌‌‌లో ఉన్న ఫర్నీచర్‌ను అభిమానులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.