
విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన బాలికలపై లైంగిక దాడికేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తన కొడుకుని అన్నపూర్ణ ప్యాకేజింగ్స్ యజమాని వేమూరి శ్యాంప్రసాద్ కావాలని అరెస్ట్ చేయించారంటూ జగదీశ్ తండ్రి ఆరోపించారు.
తన కొడుకు, వేమూరి శ్యాంప్రసాద్ కుమార్తె ప్రేమించుకుంటున్నారని, వారిని విడగొట్టడానికి తన పలుకుబడిని ఉపయోగించి తన కొడుకు మీద తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు
వేమూరి శ్యాంప్రసాద్‌కు వందల కోట్ల ఆస్తి ఉందని, ఆయనకున్న పలుకుబడితోనే ఇరవై సెక్షన్ల కింద కేసులు పెట్టి తన కుమారుడిని బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. కుట్ర ప్రకారమే తన కొడుకుపై అత్యాచారం, కిడ్నాప్ కేసులు పెట్టించారని జగదీశ్ తండ్రి గడ్డం రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘అన్నీ తప్పుడు కేసులే, వాళ్లూ అమాయకులే..’’
19 ఏళ్ల జగదీశ్ వందలమంది అమ్మాయిలపై అత్యాచారం చేశాడంటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ, హర్షిత్ లు కూడా అమాయకులేనని, వంశీ నాలుగేళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని, అతడెలా నేరాలుచేస్తాడని ప్రశ్నిస్తున్నారు.
హర్షిత్‌కు అసలు నడుం కింది భాగం పనిచేయదని చెబుతున్నారు. వేమూరి శ్యాంప్రసాద్ కుటుంబ చరిత్ర అందరికీ తెలుసని, అతడే తన కొడుకుని ఈనెల 20వ తేదీన కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. పోలీసులపై తనకు తెలిసిన వారితోఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమేనని కూడా ఆయన అంగీకరించారు.








