ఇప్పుడేమంటారు?: పాకిస్తాన్ ఎఫ్-16 కూల్చివేతపై తిరుగులేని ఆధారాలు! రాడార్ చిత్రాలు విడుదల చేసిన ఐఏఎఫ్…

iaf-releases-radar-images-regarding-downing-of-pakistan-f16
- Advertisement -

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) మరోమారు ఉద్ఘాటించింది. అంతేకాదు, దీనికి సంబంధించిన రాడార్ చిత్రాలను కూడా బయటపెట్టింది.

సోమవారం ఐఏఎఫ్ ఎయిర్‌ వైస్‌ మార్షల్ ఆర్‌జీకే కపూర్‌ వీటిని విడుదల చేశారు. ఈ చిత్రాలను విలేకరులకు కూడా ఆయన చూపించారు.

భారత్ జరిపిన ఎయిర్‌ స్ట్రయిక్‌కు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్‌లో ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌కు చెందిన 25 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటుకుని భారత గగన తలంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎఫ్‌-16, జెఎఫ్‌-17ఎస్‌ రకం విమానాలు ఉన్నాయి.

చదవండి: నిజం ఒప్పుకుంది కానీ.: ఎప్-16 యుద్ధ విమానంపై మాట మార్చిన పాక్

అయితే ఈ విషయాన్ని పంజాబ్‌లోని భారత వాయుసేనకు చెందిన రాడార్ కంట్రోల్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఓ యువ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌ పసిగట్టి సమాచారం అందించడంతో వాటిని ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్‌కు చెందిన, పిర్ పంజాల్ ప్రాంతంలో ఉన్న రెండు మిరేజ్ 2000, రెండు సుఖోయ్ ఎస్‌యూ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు బయలుదేరాయి.

అయితే పాకిస్తాన్ యుద్ధ విమానాల సంఖ్య అధికంగా ఉండడంతో కేవలం 4 యుద్ధ విమానాలతో వాటిని ఎదుర్కోవడం కష్టమని భావించిన ఆ మహిళా స్క్వాడ్రన్‌ లీడర్‌ వెంటనే శ్రీనగర్‌లోని మిగ్‌-21 బైసన్స్‌కు సమాచారం అందించడంతో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ మరో భారత పైలట్‌తో కలిసి రెండు మిగ్-21 యుద్ధ విమానాలతో బయలుదేరారు.

అనూహ్యంగా మిగ్-21 యుద్ధ విమానాలు ప్రత్యక్షం కావడంతో ఇక లాభం లేదనుకున్న పాక్ యుద్ధ విమానాలు తోకముడిచాయి. అయినా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వదల్లేదు. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఎఫ్-61 యుద్ధవిమానాన్ని పేల్చివేశాడు.

iaf-releases-radar-images-regarding-downing-of-pakistan-f16అయితే ఈ క్రమంలో అనుకోకుండా అతడు నడుపుతోన్న యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించడం, దాన్ని పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చి వేయడం, అభినందన్ పారాచూట్ సాయంతో కిందకి దిగి పాక్ సైన్యానికి పట్టుబడి, మూడు రోజుల అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకోవడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం తమ యుద్ధ విమానం ఎఫ్-16 కూల్చివేతకు గురైందని ఒప్పుకోవడం లేదు. దానికో కారణం ఉంది. పాక్ ‌కు ఈ ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేసేటప్పుడు అమెరికా ఒక షరతు పెట్టింది. అయితే భారత్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోన్న పాకిస్తాన్ ఈ షరతును ఉల్లంఘించి మరీ ఎఫ్-16 యుద్ధ విమానాలను వినియోగించింది.

చదవండి: బాలాకోట్ ఎఫెక్ట్: బరితెగించిన పాక్, ఉగ్రవాదులకు ఇక ఆర్మీ యూనీఫాం!

ఇప్పుడు అందులో ఒక యుద్ధ విమానాన్ని భారత వాయుసేన కూల్చివేసింది. పైగా ఈ విషయం బయటికి వచ్చేసింది. దీంతో అమెరికా ఊరుకుంటుందా? నేనేం చెప్పాను.. నువ్వేం చేశావ్ అని పాకిస్తాన్‌ను నిలదీయదూ? అదీ పాక్ భయం. దాంతో అసలు తాము ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వినియోగించనే లేదని, ఇక అది కూలిపోయే ప్రసక్తి ఎలా వస్తుందంటూ వాదించడం మొదలెట్టింది.

మరోవైపు పాకిస్తాన్‌కు అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలన్నీ పాక్‌ వైమానిక దళం వద్ద భద్రంగా ఉన్నాయని, అమెరికా రక్షణ శాఖ అధికారుల తనిఖీల్లో కూడా ఈ విషయం వెల్లడైనట్లుగా అమెరికా వార్తా పత్రిక ‘ఫారిన్ పాలసీ’ ఓ కథనం కూడా ప్రచురించింది.

ఆధారాలు బయటపెట్టిన ఐఏఎఫ్…

దీంతో భారత వాయుసేన తాజాగా ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్‌) అందించిన రాడార్ చిత్రాలను విడుదల చేసింది. ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ సోమవారం ఈ చిత్రాలను విడుదల చేస్తూ.. భారత వాయుసేన పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడం నిజమని, అయితే భద్రత, గోప్యత వంటి షరతులను ఉల్లంఘించినట్లు అవుతుందనే కారణంతో దీనిపై మరింత సమాచారాన్ని తాము అప్పట్లో వెల్లడించలేకపోయామని చెప్పారు.

ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఎఫ్-16ను భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 బైసన్ విమానం కూల్చేసిందని చెప్పారు. ఫిబ్రవరి 27న రెండు విమానాలు కూలిపోయాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, ఇందులో ఒకటి భారత వైమానిక దళ మిగ్ బైసన్ అయితే, ఇంకొకటి పాకిస్తాన్ ఎఫ్-16 అని ఆయన చెప్పారు.

చదవండి: అక్కడ అదృశ్యం అయ్యారంటే.. శవాలైపోయినట్లే! అసలు వెరాక్రజ్‌లో ఏం జరుగుతోంది?

రాడార్ నుంచి తీసిన చిత్రాల్లో నియంత్రణ రేఖకు పశ్చిమ దిశగా వింగ్ కమాండర్ అభినందర్ వర్దమాన్ పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని, రెండో ఫొటో.. పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానం మాయమైన పది సెకన్ల తర్వాత తీసినదని, దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఒక ఎఫ్-16 విమానాన్ని కోల్పోయిందని ఎవరికైనా అర్థమవుతుందని ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -