కన్నడంలో సూపర్ హిట్ సినిమా రైట్స్ తీసుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంత సినిమా మొదలెట్టింది అనగానే అసలు అంత గొప్ప కథ ఆ సినిమాలో ఏముంది..సమంత తనే స్వయంగా నటించాలని అనకునేంతగా ఎట్రాక్ట్ చేసిన ఆ పాయింట్ ఏమిటి..కన్నడ కథలు పెద్దగా తెలుగులో వర్కవుట్ ధాకలాలు లేవు. దానికి తోడు కన్నడ దర్శకుడునే తెలుగుకు సైతం తీసుకున్నారు. దాంతో అతను తెలుగుకు తగ్గట్లుగా సినిమాని మలచగలిగాడా..ఆ దర్శకుడు గత చిత్రం లూసియా ..తెలుగులో సిద్దార్ద వంటి ఆర్టిస్ట్ చేస్తే గాల్లో కలిసిపోయింది. మరి ఈ సారి అలాంటి ప్రమాదం జరగక్కుండా చూసుకున్నారా…కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
ఇదే స్టోరీ లైన్…
జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రచన(సమంత)..తన వృత్తిలో భాగంగా ఆర్.కె.పురం ఫ్లై ఓవర్ మీద ఉన్న డివైడర్ రాళ్లను జరిపి యూటర్న్ తీసుకుని ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తున్న వాళ్ల మీద కధనం ప్లాన్ చేస్తుంది. అందుకోసం ఆ డివైడర్ రాళ్లను రోజు వారి ఎవరైతే తీసి యుటర్న్ తీసుకుంటున్నారో వాళ్ల వివరాలు సేకరిస్తూంటుంది. యుటర్న్ తీసుకున్న వ్యక్తుల వెహికిల్ నంబర్స్ ద్వారా వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు తెలుసుకుంటుంది. ఇంటర్వూలు ప్లాన్ చేస్తుంది. ఆ క్రమంలో సుందర్ అనే ఓ బైక్ రైడర్ డిటేల్స్ తీసుకుని అతని ఇంటికెళ్లే సరికి అతను చనిపోయి ఉంటాడు. అది హత్యా..ఆత్మహత్యా అని పోలీస్ లకి అనుమానం వస్తుంది. దాంతో చివరగా ఆ ఇంటికి వెళ్లిన..రచనను పోలీస్ లు తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయటం మొదలెడతారు. ఆ క్రమంలో మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వస్తాయి.
ఆ ఫ్లై ఓవర్ పై యుటర్న్ తీసుకున్న వాళ్లంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలుస్తుంది. అంతేకాదు అందరిలోనూ కామన్ ‘U’ అనే క్లూ కనపడుతుంది. దాంతో అసలు ఏం జరుగుతోంది. యూటర్న్ తీసుకుంటున్నవాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు ..వాళ్లు చంపబడుతున్నారా..లేక వారంతట వాళ్లే చనిపోతున్నారా అనేది ఓ సస్పెన్స్ మిస్టరీగా మారుతుంది. ఆ మిస్టరీని సమంత ఎలాగైనా ఛేధించాలనుకుంటుంది. అసలు ఆమె మాటలు ఎవరైనా వింటారా…పోలీస్ లు సహకరిస్తారా…పోలీస్ అధికారి నాయక్ (ఆది పినిశెట్టి) పాత్ర ఏమిటి,…..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
డైరక్టర్ యూటర్న్…
సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ సినిమాలకు ట్విస్ట్ లే ప్రాణం.. ముఖ్యంగా సినిమా ని జస్టిఫై చేసే క్లైమాక్స్ ట్విస్ట్ మరీ ముఖ్యం. అలాగే ఆ ట్విస్ట్ లు అర్దవంతంగా ఉండాలి. సినిమా ప్రారంభంలో ఉన్న ఎత్తుగడను..ఖచ్చితంగా క్లైమాక్స్ ట్విస్ట్ జస్టిఫై చేయగలిగాలి. లేకపోతే ఎక్కడో మొదలై..మరెక్కడో ముగిసిన కథలా ఉంటుంది. ఈ సినిమాకు అదే జరిగింది.
సినిమా థ్రిల్లర్ మోడ్ లో మొదలయ్యి..సస్పెన్స్ పెంచుకుంటూ వెళ్లి… ఇక అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది అనుకునే సమయానికి జానర్ మార్చి …హారర్ గా చేసి, సెంటిమెంట్ తో దాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసి హఠాత్తుగా సినిమాని ముగించేసాడు. దాంతో చక్కటి పౌర హక్కుల సినిమా అనుకున్న ఈ కథ ..ఓ దెయ్యం పగ తీర్చుకున్న వ్యవహారంగా అయ్యిపోయింది. దాంతో దర్శకుడే యుటర్న్ తీసుకున్నాడని అర్దమవుతుంది. అతనిమీద సినిమాలో పాత్రలు పగ తీర్చకుంటాయోమో చూడాలి.
అదేదో మొదటే ఈ సినిమా హార్రర్ మోడ్ లో నడిచే సినిమా అంటే ..జపనీస్ సినిమా రింగు లా చక్కగా ఉండేది. అఫ్ కోర్స్ ఈ సినిమా కు ప్రేరణ ఖచ్చితంగా అదే. అక్కడ రింగ్ ఇక్కడ యుటర్న్ అయ్యింది. దేశం మారేసరికి రీజన్ మారింది. థ్రిల్లర్ ని అలాగే థ్రిల్లింగ్ గానే ముడి విప్పితే ఇదో క్లాసిక్ అయ్యేదనటంలో సందేహం లేదు. అలా చేయకపోవటంతో సెకండాఫ్ ఒక్కసారిగా డల్ అయ్యిపోయింది .. ఓ గొప్ప సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ మెల్లిమెల్లిగా గాల్లోకి ఎగిరిపోయింది. కథలోకి ఆత్మ రాగానే కథాత్మ వెళ్ళి పోయింది.
టెక్నికల్ గా కథ కన్నడ ఒరిజనల్ సినిమాని అనసరించింది. కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఇక సమంత తన రెగ్యులర్ కమర్షియల్ బాటని వదలి..సహజంగా నటించే ప్రయత్నం చేసింది. రంగంస్దలం అనుభవం ఉపకరించినట్లుంది. రాహుల్ రవింద్రన్ ది చెప్పుకోదగ్గ పాత్ర కాదు. ఉన్నాడంటే ఉన్నాడు..లేడంటే లేడు. ఆది పినిశెట్టి..అలాగే చేసాడు. భూమిక జస్ట్ఓకే. అంతే
చూడచ్చా..?
సస్పెన్స్ థ్రిల్లర్స్ , హర్రర్ లు నచ్చేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మొదటి షాక్ నుంచి ఎంగేజ్ చేస్తూ దర్శకుడు వెళ్ళారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం ఎంత ప్రమాదమో ఓ సినిమా ద్వారా ఎంగేజింగ్ గా చెప్పే ప్రయత్నం ఎప్పుడూ గొప్పదే. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయటం వల్ల మరిన్ని సామాజిక స్పృహ ఉన్న చూడదగ్గ సినిమాలు భవిష్యత్ లో రావటానికి ఆస్కారం ఉంటుంది.
ఫైనల్ థాట్…
చూస్తూంటే సమంత.. తన సీనియర్ నయనతార దారిలో వెళ్తున్నట్లు ఉంది. భవిష్యత్ లో హీరోయిన్ ఓరియంటెడ్ కథలకు పెద్ద దిక్కుగా మారేటట్లు అనిపిస్తోంది.
Rating : 3
———————
నటీనటులు: సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, నరేన్ తదితరులు
సంగీతం: పూర్ణచంద్ర
ఛాయాగ్రహణం: నికెత్ బొమ్మి రెడ్డి
కూర్పు: సురేష్ ఆరుముగమ్
నిర్మాతలు: శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
దర్శకత్వం: పవన్ కుమార్