బతికొస్తామని అనుకోలేదు, మహారాష్ట్రలో ఆ ఐదు రోజులూ ఏం జరిగిందంటే..: చంద్రబాబు

chandrababu
- Advertisement -

అమరావతి:   ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో.. ఎనిమిదేళ్ల క్రితం 2010లో బాబ్లీ సందర్శనకు టీడీపీ బృందం వెళ్లినప్పుడు అసలేం జరిగిందన్నది మరోసారి తెరమీదికి వచ్చింది.

ఆ ఐదు రోజులూ ఏం జరిగింది? మహారాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ప్రజా ప్రతినిధులను మన రాష్ట్ర పరిధిలోనే అరెస్టు చేసి ధర్మాబాద్‌కు తీసుకెళ్లిన నాటి నుంచి.. తిరిగొచ్చే వరకు పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది? ధర్మాబాద్ నుంచి హైదరాబాద్ వరకు నేతల ప్రస్థానం ఎలా సాగింది? దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరిగొచ్చిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

police-official-chandra-babuచుట్టూ దీపాలు.. మాకే చీకటి…

‘‘మమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నారు? బాబ్లీకేనా?’’ రాష్ట్ర సరిహద్దుల్లో మమ్మల్ని పోలీసు వ్యానుల్లోకి ఎక్కించాక మేం అడిగిన మొదటి ప్రశ్న అది. బాబ్లీకే అని పోలీసు అధికారులు అన్నారు. రక్షణ కోసం పోలీసు వ్యానుల్లో ఎక్కించారని, బాబ్లీకే తీసుకెళుతున్నారని మేం భావించాం.  రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాక మళ్లీ అడిగాం ఎక్కడికి తీసుకెళుతున్నారని. సమాధానం లేదు.

కాసేపట్లోనే ధర్మాబాద్ ఐటీఐ కళాశాల ముందు వాహనాలు అపారు. ఆ కళాశాల ఊరికి చివరన విసిరేసినట్లుంది. చుట్టూ పొలాలున్నాయి. అందర్నీ కిందికి దింపారు. మమ్మల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. అలా మా ప్రస్థానం మొదలైంది.  అది ఎన్నిరోజులు ఉంటుందో మాకెవరికీ తెలియదు. బాబ్లీని చూసి తిరిగిరావాలని బలంగా అనుకున్నాం. మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు.

అప్పటికి సాయంత్రం అవుతోంది. లోపలికి తీసుకెళ్లి ఒక హాలులో నేలమీద కూర్చోబెట్టారు. పోలీసు వాహనంలో కిక్కిరిసి వెళ్లాం. ఆ భవనంలో విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఫ్యాన్ కూడా తిరగడం లేదు.  మంచినీళ్లు ఇవ్వలేదు.  హాల్‌లో అలాగే కింద కూర్చున్నాం.  చీకటి పడింది. ఊరంతా లైట్లు వెలుగుతున్నాయి.  మాకు మాత్రం విద్యుత్ లేదు.

పోలీసు అధికారులను నిలదీశాం. చివరికి రాత్రి 7.30కు వారు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. భోజనంగా చపాతీ అందించారు.  తెల్లార్లూ నిద్రలేదు. నాలుగుసార్లు విద్యుత్ తీసేశారు.  దోమలు, ఈగటు, దుప్పట్లేమీ సరిగా ఇవ్వలేదు.  72 మంది అరెస్టు కాగా, 10 మంది మహిళలున్నారు.  అందరికీ ఒకే ట్రీట్‌మెంట్.

మరోసారి మోసం…

అక్కడ్నించి వాహనాలు బయల్దేరాయి. ఔరంగాబాదా? నాసిక్‌కా? ఎక్కడికనేది ఎవరూ చెప్పలేదు. ఉదయం 10 గంటలకు వాహనాలెక్కితే సాయంత్రం ఆరు గంటల వరకు ఏకధాటిగా ప్రయాణం. అసలే శారీరంకంగా, మానసికంగా అలసిపోయి, పోలీసు దెబ్బలతో ఉండగా ఈ ఏకధాటి ప్రయాణంతో ఒళ్లు కమిలిపోయింది.

ఎవరికీ అన్నం లేదు. అందరికీ ఆకలే.  బీపీలు, షుగరు ఉన్నవారి పరిస్థితి ఇంకా ఘోరం.  చివరకు ఔరంగాబాద్‌కు కొద్దిగా ఇవతల జాల్నా వద్ద ఒక దాభాలో ఆపారు.  తలో రెండేసి చపాతీలు ఇచ్చిరు.  అక్కడి నుంచి ఔరంగాబాద్ జైలు దగ్గరే 26 వరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో మానసికంగా సిద్ధమయ్యాం. మళ్లీ అక్కడ్నించి బస్సులు బయల్దేరాయి.

ఇక్కడా మోసమే. జైలుకని చెప్పి విమానాశ్రయానికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే జైలుకు, లేదంటే బాబ్లీకి అని నిరసనకు దిగాం. కానీ బస్సులను నేరుగా రన్‌వే వరకు తీసుకెళ్లారు.  రన్‌వేపైనే నిరసన తెలుపుతూ బైఠాయించాం. మరోసారి మహారాష్ట్ర లాఠీలు విరుచుకుపడ్డాయి. ఆ తరువాత మేం ఎక్కిన విమానం బయల్దేరింది.

babu-arrest-in-maharashtra-borderశవాల బండెక్కించి తాళం…

సోమవారం మొత్తం నిరాహార దీక్ష చేశాం. మహారాష్ట్ర పోలీసులు తెచ్చిన అల్పాహారాన్ని తిరస్కరించాం. నిరాహారదీక్ష అని చెప్పాం. బాబ్లీ పరిరక్షణ సమితి, అన్నిపార్టీలు కలిసి చేసిన నాందేడ్ బంద్ ప్రభావం ప్రభుత్వంపై పడింది.  మమ్మల్ని అక్కడ్నించి తరలించేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది.

సోమవారం రాత్రి అందరినీ ఔరంగాబాద్ తరలిస్తున్నామని, వాహనాలు ఎక్కాలన్నారు.  నిరాహారదీక్ష నీరసం, అలసటతో ఉన్నామని, మహిళలు కూడా ఉన్నారని, రాత్రిపూట తరలింపేంటని అడిగాం. వినలేదు. ఎక్కించారు. మహిళా ప్రజాప్రతినిధులందరినీ ఒక టెంపోలో వేసి దానికి తాళం వేశారు. లోపల గాలి ఆడడం లేదు. తాళం తీయండి.. కాసేపు గాలి పీల్చుకుంటామంటే వినడం లేదు.

ఆ టెంపోలో శవాల వాసన వస్తోంది. ఇది చూసి చలించిపోయాం. మా కంట కన్నీరు ఉబికొచ్చింది. పోలీసులపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశాం. నిరసనగా ప్రాంగణం బయటే కూర్చుని, అక్కడే పడుకున్నాం.  దాంతో  ఆ రాత్రికి తరలింపు ఆపారు. పడుకునే సరికి అర్థరాత్రి దాటింది.

ఒకే మరుగుదొడ్డి, విరేచనాలు…

తెల్లారి లేచాక కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు.. స్నానాలకు నీళ్లు లేవు. పది గంటలకు గొడవ చేస్తే తెప్పించారు.  72 మందికి ఒకటే బాత్‌రూమ్. ఒకటే లెట్రిన్. ప్రజాప్రతినిధులం క్యూ కట్టి వెళ్లాల్సి వచ్చింది.  దీనికి నిరసనగా మహారాష్ట్ర పోలీసులు ఇచ్చిన అటుకులు, ఉప్మాల అల్పాహారాన్ని నిరాకరించారు. బయటి నుంచి అల్పాహారం తెప్పించుకున్నాం.

తర్వాత నాందేడ్ మేజిస్ట్రేట్ వచ్చారు. బెయిల్ తీసుకుని వెళ్లిపోండన్నారు. మేం ఏం నేరం చేశామని బెయిల్ తీసుకోవాలి? ఇదే ప్రశ్న సూటిగా అడిగాం. రెండు రోజుల రిమాండ్ విధించారు. మేమంతా చర్చించుకున్నాం. ఈ దాష్టీకానికి నిరసనగా 19న బంద్‌కు పిలుపిచ్చాం.  సాయంత్రానికి కొందరు ఎమ్మెల్యేల ఆరోగ్యం దెబ్బతింది.

అపరిశుభ్ర బాత్‌రూమ్‌ను 72 మంది ఉపయోగించుకోవాల్సిన పరిస్థితుల్లో హిందూపూర్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి డయేరియా వచ్చింది.  12సార్లు విరేచనానికి వెళ్లారు.  ప్రత్యక్ష నరకం.  మండవ వెంకటేశవ్వరరావుదీ అదే పరిస్థితి. అశోక్ గజపతి రాజుకు బీపీ, షుగర్ అదుపు తప్పాయి. మీనాక్షినాయుడు, రామకోటయ్యకు జ్వరాలొచ్చాయి.

ఆదివారం అంతా కలిసి మాట్లాడుకున్నాం. జల వనరులపై కింది రాష్ట్రాల పరిస్థితిపై చర్చించుకున్నాం. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా హర్తాళ్‌లో ఉంటారని.. ఆ సమయంలో మేం భోజనం చేయడమేంటని, నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం.

ఊహించని దాడి…

మంగళవారం ఉదయం మహారాష్ట్రలో మా ఆఖరి రోజు అల్పాహారం కూడా ఇంకా తీసుకోలేదు.  పలువురు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మేజిస్ట్రేట్, ఎస్పీ వచ్చారు.  ఔరంగాబాద్ జైలుకు వెళ్లాలన్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్నామని చెప్పాం. వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ తీసుకుని వెళ్లిపోండన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పూచీగా పెట్టే ప్రశ్నే లేదన్నాం.  వారు ప్రాంగణం బయటికి వెళ్లారు.  అంతే! ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి పోలీసులు వచ్చి దండులా మీదపడ్డారు. లాఠీలు, తుపాకీ మడమలతో పొట్టలో కొట్టారు.  ఎక్కడపడితే అక్కడ బాదేశారు.  అస్వస్థతతో బాధపడుతున్న వారి సెలైన్ సూదులు పీకేశారు.  మహిళలను జుట్టు పట్టుకుని తన్నారు.

మాకు పరిస్థితి అర్థమైంది.  అక్కడ ప్రజాస్వామ్యం లేదని. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసించి పంపించేయాలని అనుకుంటున్నారని. ఐటీఐ కళాశాలలో మేం ఉంటున్న గదుల నుంచి రోడ్డుపై వాహనాలు ఉంచిన ప్రదేశానికి 200 మీటర్ల దూరం ఉంది.  ఆ దారికి అటూ ఇటూ రెండు వరుసలుగా పోలీసులు నిలబడ్డారు.

ఒక బ్యాచ్ పోలీసులు తలుపులు పగులగొట్టి మరీ గదుల్లో ఉన్నవారందరినీ కొట్టి, నిలబడ్డ పోలీసు బారుల మధ్యకు తోసేస్తున్నారు.  అక్కడి నుంచి వాహనాల్లోకి ఎక్కేవరకు ఏ పోలీసుకు కోపం వచ్చినా కొట్టడమే.  చాలామందికి దెబ్బలు తగిలాయి. కనీసం చెప్పులు వేసుకోనివ్వలేదు. లగేజీ తీసుకోనివ్వలేదు.  మెడలో చైన్లు, చెవి రింగులు కూడా లాగేసుకున్నారు. సహాయకుల్ని, గన్‌మెన్‌లను కూడా తీవ్రంగా కొట్టారు.

నా వ్యక్తిగత సహాయకుల్ని ఆరు కిలోమీటర్ల దూరం వెంటాడి కొట్టారు.  ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్లు లాగేసుకున్నారు.  నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు.  అక్కడి పోలీసులు మా పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రజాప్రతినిధులకు ఇంత దారుణమైన ట్రీట్‌మెంట్ ఇవ్వడం చూడలేదు.

అంత దౌర్జన్యంగా ప్రవర్తించారు మహారాష్ట్ర పోలీసులు.  మేమేం నేరం చేశాం?  ఎన్టీఆర్ ప్రభుత్వాన్నిఇందిరాగాంధీ బర్తరఫ్ చేసినప్పుడు కూడా మేం ఢిల్లీ, బెంగళూరు తిరిగాం.  ఎక్కడా ఎవరినీ కొట్టలేదు.  మహారాష్ట్ర నుంచి బతికొస్తామని అనుకోలేదు. రాష్ట్ర ప్రజల అభిమానం, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్‌ల ఆశీస్సులతోనే తిరిగొచ్చాం.

 

 

- Advertisement -