కొన్నేళ్ల క్రితం.. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘కారు దిద్దిన కాపురం’ అని సినిమా వచ్చింది. ఇదీ అంతే.. కారుని తయారుచేసిన ఓనర్‌ని కొందరు చంపేస్తారు. అప్పుడతని ఆత్మ ఆ కారులోకి దూరి.. తననెెవరైతే చంపేశారో… వారందరి మీద పగ తీర్చుకుంటుంది.. ఒక్కసారి మీరు హాలీవుడ్ సినిమాలని చూస్తే.. ఇలా కారు పగదీర్చుకున్నవి చాలా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా ‘ది కార్’ , వీల్స్ ఆఫ్ టెర్రర్, రబ్బర్, కిల్ డోజర్ లాంటి సినిమాలెన్నో. సరిగ్గా ఇలాంటి చిత్రాల కోవలోనే తాజాగా వచ్చిన సినిమా ‘టాక్సీవాలా’..
ఒక్క ముక్కలో చెప్పాలంటే…
ఒక దెయ్యం కారుని నడుపుతుంది. మర్డర్లు చేస్తుంది.. తెలియక తక్కువ ధరకి వస్తుందని ఆశపడి ఒక కారు కొని.. ఉపాధి కోసం టాక్సీవాలాగా మారిన హీరో కథ ఇది.. ఇందులో ఆ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. అతనికి ఉన్న యూత్ ఫాలోయింగ్‌కి.. సినిమా ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. లింక్ ఎక్కడో తెగిపోయింది.
అంటే సినిమా చూస్తోంటే మనకు కథంతా బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కానీ తెలిసినట్టు ఉండదు. ఎందుకంటే ఫస్టాఫ్ అంతా కామెడీతో వెళ్లిపోవడంతో.. హర్రర్ మూవీగా సినిమా మొదలైనప్పటికీ.. ర్రూ…ర్రూ…అంటూ కారు చక్రాలు రోడ్డు మీద జారిపోయినట్టు హర్రర్ ఎక్కడో జారిపోయింది. చివరికి కారు మాత్రం కామెడీ ట్రా(బ్రే)క్ తో ఆగిపోయింది.
కథలోకి వెళితే..
హీరో మధ్యతరగతి జీవి.. పేరు శివ. ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఫ్రెండ్ రూమ్‌లో చేరతాడు. ఆ ఫ్రెండ్ (మధు నందన్).. ఒక కార్ల మెకానిక్.. మన హీరో అక్కడ ఉంటూ.. కొంతకాలం పిజ్జా డెలివరీ బాయ్‌లా పనిచేస్తాడు. కానీ ఆ పని అతడికి నచ్చదు. దాంతో ఫ్రెండు సలహాతో క్యాబ్ డ్రైవర్ గా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునని తెలుసుకుంటాడు.
తన మధ్య తరగతి సహజమైన కష్టాలతో.. ఇంట్లో వదిన గాజులు అవీ తాకట్టు పెట్టి వచ్చిన అతి తక్కువ డబ్బుతో ఒక కారు కొంటాడు. అప్పటికే ఆ కారు సంగతి తెలిసిన ఓనరు దానినెలాగైనా వదిలించుకుందామని మన హీరోకి అమ్మేస్తాడు. అప్పటి నుంచి హీరోగారికి కష్టాలు మొదలవుతాయి. ఎందుకంటే అందులో దెయ్యం ఉందనే సంగతి హీరో గ్రహిస్తాడు.
మొదట ఫ్రెండ్స్.. అంటే ఒకరు మధునందన్, రెండోవ్యక్తి విష్ణు.. సినిమాలో అతని పేరు హాలీవుడ్.. వారిద్దరికి ఈ విషయం చెప్పినా వారు నమ్మరు. కానీ ఆ కారులోనే దెయ్యాల సినిమా సీడీ వేసుకొని చూసేసరికి.. దెబ్బకి వీరికి పట్టిన దెయ్యం వదిలి.. ఆ కారులో నిజంగానే దెయ్యం ఉందనే సంగతి గ్రహిస్తారు.
ఇక హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (అను), మాళవిక నాయర్ (శిశిర)లకు ఉన్న సంబంధం ఏమిటనేది.. కొంత సైడ్ ట్రాక్ లో నడుస్తుంటుంది. అలాగే దెయ్యం కారుకి ఉన్న ప్లాష్ బ్యాక్ వీక్ గా ఉంది. ఇంత సినిమాని దెయ్యం నడిపి లీడ్ చేస్తున్నప్పుడు.. ఆ ఫ్లాష్ బ్యాక్ ను ఇంకొంచెం స్ట్రాంగ్ గా అల్లితే సినిమాకు పట్టు ఉండేది.
సినిమా అంతటా తనే ఉండాలని విజయ్ డిమాండ్ చేస్తున్నాడా?
ఎంతసేపూ విజయ్ దేవరకొండపైనే సినిమా భారమంతా పడిపోతుంది. ఇటీవల వచ్చిన ఇతర సినిమాలు.. స్టోరీలన్నీ కూడా.. అలాగే ఉన్నాయి. కథనంతా తనే మోయడం అనవచ్చు.. లేదా.. ప్రతి ఫ్రేమ్‌లో తనే కనిపించాలనే పాత హీరోల మాదిరిగా ఇతడూ డిమాండ్ చేస్తున్నాడేమో తెలియదుగానీ.. టాక్సీవాలా సినిమాలో దాదాపు అన్ని ఫ్రేముల్లో విజయ్ దేవరకొండ మాత్రమే మనకు కనిపిస్తుంటాడు.
హీరోయిజం ఎలివేట్ కావాలి. హీరో తప్ప ఇంకెవరూ సినిమాలో హైలైట్ కాకూడదు. ఇది ప్రతి హీరో తెరవెనుక చేసే పనే.. కానీ స్టార్టింగ్.. స్టార్టింగే.. ఇలా చేస్తే.. తర్వాతర్వాత.. యాక్టింగ్‌లో సినిమా సినిమాకీ ఇంప్రూవ్డ్ పెర్‌ఫార్మెన్స్ చూపించాల్సి వస్తుంది. మరి విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడి సినిమాలన్నీ కూడా రొటీన్ గా ఉంటున్నాయి.
ఒకటే టైప్ ఆఫ్ డైలాగ్ మాడ్యులేషన్, రొటీన్ యాక్టింగ్‌తో ముందుకెళుతున్నాడు. అయితే ఈ తరహా యాక్టింగ్ ప్రేక్షకులను కొంతకాలం అలరిస్తుందేమోగానీ.. భవిష్యత్తు అంతా ఇదే అతడి సినిమాలను నిలబెడుతుందనుకోవడం భ్రమే.. అందువల్ల కథకి కూడా కొంత స్సేస్ ఇస్తే డైరెక్టర్ కి.. కొంత ఫ్రీడమ్ ఉండి.. కొంచెం ఫ్రీ హ్యాండ్‌తో హ్యాండిల్ చేస్తాడు. నిబంధనల చట్రంలో పెట్టి, సక్సెస్ ఫార్ములాల్లో కూర్చోబెడితే.. కథ, కథనం ‘టాక్సీవాలా’ మాదిరిగానే అక్కడక్కడ అటూ ఇటైపోతాయి.
పాత సక్సెస్ ఫార్ములాతో కొత్త సినిమాల ఒరవడి..
ఇదెప్పుడో మొదట చెప్పుకున్నట్టు .. పగతీర్చుకున్న కారు.. పాత ఫార్ములానే.. అరిగిపోయిన ఫార్ములాని.. ఇప్పటి జనరేషన్ కోసం మళ్లీ యువ హీరోతో తీశారు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చూస్తున్నవారంతా యువతరమే. పెద్దవాళ్లు సినిమా థియేటర్లకు వెళ్లేది చాలా తక్కువ. అందుకని వారు చూస్తే.. ఇది పాత కథేనని చెప్పేస్తారు.
కాకపోతే చూసేవాళ్లు కొత్తతరం కాబట్టి కారు పగతీర్చుకోవడం, అందులో హీరో ఇరుక్కోవడం, అసలు కారులో ఉన్న దెయ్యం అడ్రస్ కనుక్కోవడానికి హీరో పడే అవస్థలు.. ఇవన్నీ కొంత కొత్తదనం అద్దినా.. పాత మూసలోనే సాగిపోయింది. చివరకు చెప్పొచ్చేదేమిటంటే.. కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూడదగ్గ సినిమాగానే చెప్పాలి.
తారాగణం…
నిర్మాణ సంస్థలు: జి.ఎ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్
తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, మధునందన్, సిజ్జు, ఉత్తేజ్, యమున, కల్యాణి, రవిప్రకాశ్, రవివర్మ తదితరులు
సంగీతం: జేక్స్ బిజాయ్
ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్
కూర్పు: శ్రీజిత్ సారంగ్
స్క్రీన్‌ప్లే, మాటలు: సాయికుమార్ రెడ్డి
నిర్మాత: ఎస్.కె.ఎన్
కథ, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
– శ్రీనివాస్ మిర్తిపాటి