టీడీపీకి గట్టి షాక్.. మడకశిర ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు!

tdp-mla-eeranna-high-court
- Advertisement -

హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి మంగళవారం హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా మడకశిర టీడీపీ అభ్యర్థిగా ఈరన్నదాఖలు చేసిన అఫిడవిట్‌లో వ్యక్తిగత విషయాలను దాచి పెట్టారంటూ వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి 2014 జూన్‌లో కోర్టును ఆశ్రయించారు.

కర్ణాటకలోని మడికెరి జిల్లా మన్నంపేట పోలీస్ స్టేషన్‌లో ఈరన్నపై క్రిమినల్ కేసులు ఉన్నాయని… ఆ విషయాన్ని ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొనలేదని తిప్పేస్వామి ఆధారాలను సమర్పించారు. అంతేకాదు, ఈరన్న భార్య ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న విషయాన్ని కూడా దాచి పెట్టారని కోర్టుకు తెలిపారు.

అఫిడవిట్‌లో వివరాలను దాచినందుకు… 

టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్‌లో పొందుపరచలేదు.

ఈ వివరాలను 2014 ఎన్నికల సమయంలోనే వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు. దీంతో తిప్పేస్వామి ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ కేసులో వాద, ప్రతివాదనలను విన్న హైకోర్టు… చివరకు ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పును వెలువరించింది. ఈ విషయాలను ఈరన్న అఫిడవిట్‌లో పేర్కొనక పోవడాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామికి ఓట్ల లెక్కింపులో రెండో స్థానం దక్కినందున… ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఆదేశించింది.

- Advertisement -