24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా రివ్యూలు పెళ్లంటే.. ఇదేరా! (శ్రీనివాస కళ్యాణం రివ్యూ)

పెళ్లంటే.. ఇదేరా! (శ్రీనివాస కళ్యాణం రివ్యూ)

srinivasa-kalyanam
- Advertisement -

పెళ్ళి అనేది ఒకప్పుడు కుటుంబాల్లో పెద్ద పండుగ. బంధువులు, స్నేహితులు ఓ చోట కలిసి సరదాగా కాలక్షేపం చేస్తూ ఆనందించే వేడుక.. సంప్రదాయల కూడిక. కానీ కాలం మారింది. వాట్సప్ లో శుభలేఖలు, పెళ్లి ఆహ్వానాలు, శుభాకాంక్షలు పంపుకుంటున్నాం. మరుసటి రోజు ఫేస్ బుక్ లో ఆ ఫొటోలు పెట్టి.. అందరి ఆశీస్సులు పొందుతున్నాం. అప్పటిలా జనం సరదాగానో, కాలక్షేపానికో పెళ్లిళ్లకు వెళ్లటం లేదు. కేవలం ఆ టైమ్ కు వెళ్లి భోజనం చేసి వచ్చేసి హాజరు వేయించుకుంటున్నారు. లేకపోతే మేము అంతంత దూరాలు రాలేము.. మీరే ఇక్కడ రిసెప్షన్ పెట్టుకోండి లేదా ఓ రోజు అందరం కలిసి హోటల్ కు వెళ్దాం అని అనేస్తున్నారు. అలా మైండ్ సెట్ మారిపోయిన ఈ నేపథ్యంలో పెళ్లి విశిష్టతను తెలుపుతూ ‘శ్రీనివాస కళ్యాణం’ జరిపించారు దిల్ రాజు, వేగేశ్న సతీష్. మరి ఈ పెళ్లి వేడుక ఎలా ఉంది… విందు భోజనం దక్కినట్లేనా… రివ్యూలో చూద్దాం.

srinivasa-kalyanamకథే కళ్యాణం…

తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి కుర్రాడైన శ్రీనివాస్ (నితిన్) చిన్నప్పటి నుంచి తమ ఇళ్లళ్లో గ్రాండ్ గా జరిగే పెళ్లిళ్లు చూస్తూ పెరిగినవాడు. పెద్దయ్యాక తను కూడా అలా పెళ్లి చేసుకుంటే బాగుండును అని ఆశలు పెంచుకున్నవాడు… అలాంటి కుర్రాడు పెద్దయ్యాక చంఢీఘర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సిరి (రాశిఖన్నా)ని ప్రేమిస్తాడు. ఆమెతండ్రి ఆర్‌.కె(ప్ర‌కాశ్ రాజ్‌)  హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన్ని కలిసి తన ప్రేమ విషయం చెప్తాడు.

ఆయనా మంచివాడే..ఓకే..దాన్దేముంది..నా కూతురు ఇష్టమే ..నా ఇష్టం అని జెంటిల్ గా బిహేవ్ చేస్తాడు. అయితే మరి సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే… సదరు ఆర్కే గారు టైమ్ సెన్స్ ఉన్న వ్యక్తి. కాస్తంత ప్రాక్టికల్ వ్యవహారం ..లేకపోతే అంత పెద్ద కోటీశ్వరుడు కాడు కదా. ఆయన మన శ్రీనివాస్ ని కూర్చోబెట్టి…ఈ పెళ్లి తంతులు పేరు చెప్పి టైమ్ వేస్ట్ చేయకు..నాకు ఊపిరి సలపనంత బిజీ అంటాడు.

అలాగే తన పెద్ద కూతురు డైవర్స్ విషయం దృష్టిలో పెట్టుకుని… ఎప్పుడైనా తన కూతురు విడిపోవాలనుకంటే నస పెట్టకుండా వెంటనే డైవర్స్ పేపర్ మీద సైన్ చేయాలని ఓ కండీషన్ పెడతాడు. మరి సంప్రదాయం, కుటుంబం వంటి వాటికి విలువఇచ్చే శ్రీనివాస్ ఆ కండీషన్ కు ఓకే అంటాడా…ఆర్కేలో ఎలా మార్పు తెచ్చి తన పెళ్లి చేసుకుంటాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

srinivasa-kalyanam-movieఎలా ఉందంటే..

అసలు పెళ్లెందుకు చేసుకోవాలి? చక్కగా సహజీవనం చేసుకోవచ్చుగా అని ఆలోచిస్తున్న సాప్ట్‌వేర్ జనరేషన్ ఇది. ఈ సమయంలో పెళ్లి తంతు.. దాని వెనక ఉన్న పరమార్థం.. చెప్పాలనుకోవటం మంచి ఆలోచనే. అయితే ఆ విషయం ప్రెజెంట్ చేసిన తీరే ఇబ్బందిగా అనిపిస్తుంది.

నో డౌట్… దర్శకుడు వేగేశ్న సతీష్.. రచయత‌గా ఎప్పుడో ప్రూవ్ అయినవాడు. ‘శతమానం భవతి’తో దర్శకుడుగానూ మరో మెట్టు ఎక్కిన వాడు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అసలు కాన్‌ఫ్లిక్ట్ అంటూ రైజ్ కానీ మరీ అంత థిన్ లైన్‌ని ఎందుకు ఎంచుకున్నారనేది సినిమా చూశాక ఓ పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. ప్రకాష్ రాజ్ పాత్ర లో మార్పు తీసుకువచ్చే ఈ కనువిప్పు కథతో సాధించేదేముంది అనిపిస్తుంది.

ఈ తరం ప్రతినిధిగా హీరో నితిన్.. ఇటువంటి పెళ్లి తంతులకు తాను విరుద్దమని.. టైమ్, కెరీర్ వంటి విషయాలు గురించి మాట్లాడితే.. అలా కాదు.. మన సంప్రదాయాలు మీరు మర్చిపోతున్నారు… మీ తాత, తండ్రి, మీ మామయ్య, బాబాయి, నాన్నలు అలా సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టే…ఇంతకాలం ఇలా కలిసి ఉన్నారు అనే అర్థం వచ్చేలా ఆ పెళ్లి తంతుని చూపితే బాగుండేది.

యూత్.. ఆ పాత్రతో ఐడింటిఫై అయ్యేందుకు అవకాశం ఉండేది. ప్రకాష్ రాజ్ పాత్రలో మార్పు వస్తే ఎంత.. రాకపోతే వచ్చే నష్టం ఏమిటి.. అయినా ఆ క్యారెక్టర్  పాయింటాఫ్ నుంచి చూస్తే అందులో తప్పేమీ కనిపించదు.

ఆ పాత్ర అలా టైమ్ సెన్స్ తో ఉండబట్టే… ఆ స్థాయికి వచ్చాడనిపిస్తుంది. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర.. క్లైమాక్స్ వచ్చేసింది ఇక మారకపోతే బాగుండదు అని మార్పు బలవంతంగా తెచ్చుకుని డైలాగులు చెప్పినట్లుంది.

సెకండాఫ్ లో వరస పెట్టి పెళ్లి  సీన్స్ చూస్తూంటే.. దర్శకుడు సతీష్ గారికి ఆయనది లేదా ఎవరిదైనా  పెళ్లి క్యాసెట్ చూస్తున్నప్పుడు.. వచ్చిన ఆలోచనో ఏమో కానీ… ఆనాటి వాతావరణం మళ్లీ క్రియేట్ చేసి షూట్ చేసేశారు అని డౌట్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

srinivasa-kalyanam3చేయటానికి ఏముంది?

నితిన్ గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు… ఎందుకంటే ఈ సినిమాలో నితిన్ హీరోగా కనిపించడు. అతను ఏమీ చెయ్యటానికి లేదు. కేవలం ఫస్టాఫ్ లో బుగ్గపై హీరోయిన్ చేత ముద్దులు పెట్టించుకోవటం, సెకండాఫ్ లో బుగ్గపై చుక్క పెట్టించుకుని పెళ్లి పీటలపై కూర్చోవటం తప్ప. రైజింగ్ లో ఉన్న హీరో రాజీపడి ఇలాంటి పాత్ర ఒప్పుకోవటం గొప్ప విషయమే.

ప్రకాష్ రాజ్ పాత్ర ఎన్నో సినిమాల్లో చేసిందే మనం చూసిందే, జయసుధ అయితే మాటిమాటికి సంప్రదాయం అంటూ మాట్లాడటమే ఓ సంప్రదాయంగా గడిపేసింది. రాజేంద్రప్రసాద్‌, అజయ్, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌, జోష్ రవి  వీళ్లందరివీ కేవలం అలా వచ్చి వెళ్లిపోయేవే. ఉన్నంతలో కాస్తంత ప్రవీణ్ కే లెంగ్త్ ఎక్కువ ఉంది. అజయ్  వంటి సీనియర్ నటుడుని ఎందుకు తీసుకున్నారో అర్దం కాలేదు. ఎడిటింగ్ లో సీన్స్ లేచిపోయోయో తెలియదు.

టెక్నికల్ గా..

సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్..పాటలు ..వినగా వినగా ఎక్కేటట్లు ఉన్నాయి. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ గోదావరి అందాలను పట్టిచ్చింది.

“వాట్సప్ లో రోజూ ఎవడెవడికో గుడ్ మార్నింగ్ , గుడ్ నైట్స్ చెప్తాము, పేరెంట్స్ కు డైలీ ఒక్కసారి ఫోన్ చేసి చెప్తే వాళ్లు ఎంత హ్యాపీగా ఉంటారు? “
“ పెళ్లి లో బంధువులు అందరినీ చూస్తే 70 ఏళ్ల నా జీవితం గుర్తుకు వస్తుంది” వంటి డైలాగులు సతీష్ చాలా హృద్యంగా రాసారు.

వెళ్లచ్చా?

సరదాగా మన కుటుంబాల్లో ఆ రోజుల్లో  పెళ్లిళ్లు ఎలా జరిగేవి అనే విషయం తెలుసువటానికి మంచి ఆప్షన్. అసభ్యత, హింస లేదు కాబట్టి ఫ్యామిలీలు ఎంకరేజ్ చేయచ్చు.

ఫైనల్ థాట్…

సినిమా చూసాక..పెళ్లి చేసుకుంటే కాస్త ఖర్చు ఎక్కువైనా సినిమాలో చూపించినట్లు  గ్రాండ్ గా చేసుకోవాలనిపించింది.  ఈ విషయం  మా అమ్మా,నాన్నకు చెప్దామని ఫిక్స్ అయ్యా…….కాని ..ఇంతలోకి మా మిసెస్ నుంచి ఫోన్ వచ్చి…ఆల్రెడీ పెళ్లై పోయిందనే చేదు నిజం గుర్తు చేసింది.

ఎవరెవరు…

నటీనటులు: నితిన్‌, రాశీఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌ తదితరులు
స‌ంగీతం: మిక్కీ జే మేయర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: సమీర్‌రెడ్డి
కూర్పు: మధు
నిర్మాత: దిల్‌రాజు‌, శిరీష్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సతీష్‌ వేగేశ్న
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుద‌ల‌: 09-08-2018

josyula surya prakash
– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -