విసుగెత్తించే రూపం (‘విశ్వరూపం’ రివ్యూ)

- Advertisement -

vishwaroopam-2

హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయటం బిజినెస్ పరంగా వర్కవుట్ అయ్యే విషయమే కానీ చాలాసార్లు కంటెంట్ పరంగా కటీఫ్ చెప్పే సంగతే. అయితే ఒక కథను .. రెండున్నర గంటల్లో చెప్పలేము … భారీగా పెట్టిన పెట్టుబడి వెనక్కి లాగలేము అనుకున్నప్పుడు దాన్ని రెండు ముక్కలు చేసి వడ్డించటం సినీ సామాజిక న్యాయం. తప్పేమీ కాదు. అయితే రెండు పార్ట్ ల మీదా అదే శ్రద్ద పెడితే అది బాహుబలి అవుతుంది. లేకుంటే…అది రక్త చరిత్ర 2 గా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.  ఈ నేఫథ్యంలో వచ్చిన విశ్వరూపం 2 ఏ కోవకు చెందినదో…చూద్దాం. కమల్ తొలి చిత్రం నాటి మ్యాజిక్ రిపీట్ చేశారో లేదో పరిశీలిద్దాం.

viswaroopam-2కథ ఇదే…

తమతో కలిసి పనిచేసిన విసామ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ (క‌మ‌ల్‌హాస‌న్‌)…నిజానికి ఇండియాకు చెందిన  ‘రా’ ఏజెంట్  అని అల్ ఖైదా పసిగట్టేస్తుంది.  దాంతో అల్‌ఖైదా టెర్రరిస్ట్ నాయకుడు ఒమ‌ర్ ఖురేషి (రాహుల్ బోస్‌)… విసామ్‌ని  చంపి పగ తీర్చుకోవాలని రగిలిపోతాడు. అంతేకాదు  ఇండియాలో 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకుని మరోసారి  రంగంలోకి దిగిన ‘రా’ ఏజెంట్ విసామ్ … ఒమ‌ర్ ఖురేషి ఎత్తుకు పై ఎత్తులు వేస్తాడు. తమ టీమ్ నిరుప‌మ (పూజా కుమార్‌), అస్మిత (ఆండ్రియా) సాయింతో ఒమర్ కు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో ఇక డైరక్ట్ గా ఫేస్ టు ఫేస్ వార్ కు దిగుతాడు ఒమర్. విసామ్ ని లేపేయాలని భారీ ప్లాన్ వేస్తాడు. అయితే దీన్ని విసామ్ ఎలా తిప్పి కొట్టాడు, మన దేశంలో బాంబు పేలుళ్లు జరగకుండా ఎలా ఆపగలిగాడు అనేది క్లైమాక్స్.

ఎలా ఉంది…

తొలి చిత్రం వచ్చిన ఐదేళ్ళ తర్వాత  రిలీజ్ అయిన ఈ సినిమా …మొదట సినిమా చూసి ..ఇన్నాళ్లు గుర్తు పెట్టుకోవటమో లేక సినిమా చూడటానికి ముందు ఏ యూట్యూబ్ లోనో మొదట పార్ట్ చూసిన వారికే అర్దమవుతుంది. అంతేకానీ డైరక్ట్ గా రెండో పార్ట్ చూసేద్దాం అనుకుంటే బుక్ అయిపోయినట్లే. అలాగే కమల్ తొలి చిత్రానికి పెట్టిన శ్రద్దలో పదవ వంతు కూడా ఈ సినిమాపై పెట్టినట్లు కనిపించదు. మొదలెట్టాం..ఏదో ముగించాలి తప్పదు అన్నట్లు ఫినిష్ చేసినట్లు ..సెకండాఫ్, క్లైమాక్స్ సీన్స్ చూస్తే అనిపిస్తుంది.  అంత నిరాశక్తంగా తీసిన మూవీలా ఉంటుంది.

పేరుకు స్పై థ్రిల్లర్ గానీ ఎక్కడా థ్రిల్స్ అనేవి ఉండవు. క్లైమాక్స్ అయితే ఎనభైల్లో వచ్చిన విలన్ ..హీరో ఫ్యామిలిని కిడ్నాప్ చేయటం …హీరో కు బాంబ్ పెట్టడం..హీరో దాన్ని ఛేథించుకుని వచ్చి తన కుటుంబాన్ని రక్షించుకోవటం వంటి అంశాలతో నిండిపోయింది. ఇక విలన్ …మన కమల్ ని వెతుక్కుంటూ వస్తాడు కానీ…కమల్ ..అతన్ని వెతుక్కుంటూ వెళ్లి నాశనం చేయాలనుకోడు. ఏదో ముగించేయాలి..చుట్టేద్దాం అని హడావిడిగా సీన్స్ లాగించేసినట్లు ఉన్నాయి.

vishwaroopam-2-3ఎందుకలా ??

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల క్లైమాక్స్ లో …విలన్ …దేశంలో బాంబులు పెడతాడు..హీరో సాహసం చేసి రక్షించాలి అనే ఫర్మనెంట్ సీన్ ఎందుకు ఉంటుందో ..అర్దం కాదు..ఈ సినిమాలోనూ అదే రిపీట్ చేశారు.

అవి బాగానే ఉన్నా…

డైలాగ్స్  బాగానే   పేలాయి. ఈనాటి  రాజ‌కీయాలు,రాజకీయనాయకులపై  గురించి..  ఔత్సాహిక రాజకీయనాయకుడు క‌మ‌ల్ వేసిన చుర‌క‌లు కూడా బావున్నాయి. అలాగే ఎస్పీ బాలసుబ్రమణ్యంని వదిలి క‌మ‌ల్ హాస‌న్ స్వంతంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే  స‌ముద్రంలోప‌ల  సీన్స్ లో , సీజీ వ‌ర్క్ బాగుంది(సీజీ వర్క్ అని తెలిసిపోయేలా). కొన్ని షాట్స్ …డైరక్టర్ గా కమల్ స్టాండర్డ్స్ ని తెలియచేస్తాయి.

అయితే ఫ‌స్ట్ పార్ట్‌లోని ఇంట్రస్టింగ్స్ ఎలిమెంట్స్  విశ్వ‌రూపం 2లో మిస్ అయ్యాయి. ఆ బోర్ సీన్స్ కు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాగింది.

ఎవరెలా చేశారంటే…

కమల్ హాసన్ ఎప్పటిలాగే నటనలో జీవించేసాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఈశ్వ‌ర ‌శాస్త్రితో క‌లిసి చేసిన సీన్స్, డైలాగులు బాగున్నాయి. సెకండాఫ్ లో అల్జీమర్స్ వచ్చిన  త‌న త‌ల్లి(వహీదా రెహమాన్‌) చేసిన సీన్స్ బాగున్నాయి.  విలన్ ఒమ‌ర్ ఖురేషీగా రాహుల్ బోస్  నటన ఎక్సలెంట్ అని చెప్పాలి.

ఫైనల్ థాట్…

రీసెంట్ గా  వచ్చిన స్పై థ్రిల్లర్స్ అడవి శేషు గూఢచారి, టామ్ క్రూజ్  ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ఫాలవుట్‌’ చూసిన తర్వాత ఈ సినిమా చూస్తూంటే  … టీవీలో కృష్ణగారి పాత జేమ్స్ బాండ్  సినిమా చూసినట్లు అనిపించింది.

vishwaroopam-2-4ఇప్పుడే థియోటర్ నుంచి విశ్వరూపం -2 చూసి బయిటకు వస్తున్న కమల్ ???

టీమ్ ఇదే…

బ్యాన‌ర్‌: రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆస్కార్ ఫిలిమ్స్ వి. ర‌విచంద్ర‌న్‌
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌,
పాటలు: రామజోగయ్యశాస్త్రి,
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌,
ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌,
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌,
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌

josyula surya prakash
– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -