చాలాకాలం క్రితం.. అపరిచితుడు అని టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా.. హీరో విక్రమ్‌తో వచ్చింది. అందులో హీరో మల్టిపుల్ డిజార్డర్ తో బాధపడుతుంటాడు. ఆ హీరో లక్షణాలను డాక్టర్లతో, ఆధారాలతో ఎంతో చక్కగా వివరిస్తారు. సేమ్ అదే రీతిలో ఇక్కడ హీరో.. జన్మించడాన్ని అదేరీతిలో వివరించే ప్రయత్నం చేశారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సవ్యసాచి’..
ఇందులో హీరో(నాగ చైతన్య).. యాడ్ ఫిల్మ్ డైరెక్టర్.. కాలేజీ రోజుల్లో చిత్ర (హీరోయిన్ నిధి అగర్వాల్)ను ప్రేమిస్తాడు. అనుకోని రీతిలో మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ కలుసుకుంటారు. అదే సమయంలో హీరో అక్క(భూమిక) ఇంట్లో బాంబు పేలుతుంది. ఆ ప్రమాదంలో హీరో బావ (భూమిక భర్త) మరణిస్తాడు. తర్వాత అక్క కూతురిని కిడ్నాప్ చేస్తారు? అసలెందుకు బాంబు పేలింది? కారణాలేమిటి? ఆ కిడ్నాప్ అయిన తన అక్క కూతురిని హీరో ఎలా కాపాడాడు? అన్నదే ‘సవ్యసాచి’ కథ.
ఇక్కడ నుంచి జరిగే మైండ్ గేమ్ అంతా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను తలపిస్తుంది. ఈ ఎపిసోడ్ వెనుక విలన్ మాధవన్ (అరుణ్) ఎలా వచ్చాడు? ఈ మధ్యలో ‘వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్..’ వాడిన విధానం.. ఇవన్నీ హీరోతో సింక్రనైజేషన్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో హీరో ఎడమ చేతిలో ఉన్న కవల సోదరుడు హీరోకెలా సాయపడ్డాడు అన్నది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే. సవ్యసాచి అంటే రెండు చేతులతో ఏ పనైనా చేయగలడని అర్థం వచ్చేలా ఈ టైటిల్ పెట్టారు.
‘సవ్యసాచి’ అంటే.. ఏక కాలంలో రెండు చేతులతో బాణం వేయగలిగిన వాడు అని అర్థం. మహాభారతంలో అర్జునుడు ఒక్కడే ఇలా వేయగలిగేవాడు.. అందుకే అర్జునుడిని సవ్యసాచి అని పిలిచేవారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఇక్కడ కూడా మన హీరో రెండు చేతులతో ధనస్సు కరెక్టుగానే పట్టుకొని.. బాణం వేశాడుగానీ.. అది సక్సెస్‌కి కొంచెం పక్కన తగిలింది.
ఇందుకు కారణాలనేకం..వాటిలో ముఖ్యంగా..
1. నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్..ఇప్పటివరకు వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ లు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగ స్థలం.. ఈ సినిమాలు తీసిన సంస్థ.. ఎందుకంటే వారి కథల ఎంపిక అద్భుతమని, ప్రేక్షకుల పల్స్..వారికి తెలుసని అందరూ ఇంతవరకూ చేసిన కామెంట్లు..ఈ సినిమా కూడా మేకింగ్ పరంగా చాలా రిచ్ గా తీశారు.
2. డైరెక్టర్: చందూ మొండేటి.. గతంలో నాగచైతన్యతో వచ్చిన ‘ ప్రేమమ్‘.. ఒక మంచి లవ్ స్టోరీని అంతేగొప్పగా ట్రీట్ మెంట్ ఇచ్చినతీరు అందరినీ ఆకట్టుకుంది. మొదటి చిత్రం కార్తికేయ సూపర్ హిట్ కావడం అందరికీ తెలిసిందే..
3. ఇక చివరగా హీరో.. నాగ చైతన్య: చైతూకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. కథలో ఎంపికలో ప్రయోగాలకి పెద్దపీట వేస్తాడని, తను నమ్మిన డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ ఉంటాడని అంటుంటారు. అయితే అదంతా తండ్రి నాగార్జున వారసత్వం నుంచి వచ్చిందనేది ఇండస్ట్రీ టాక్.. ఎందుకంటే నాగార్జున కూడా ఎప్పుడూ హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా కథ బాగుంటే.. అవకాశాలు ఇచ్చేవాడు.. ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు అది.
అది ఒకరకంగా అడ్వాంటేజ్.. మరో రకంగా డిసెండ్వాంటేజ్ కూడా అయ్యింది. అయినా తను నమ్మిన అదే పంథాను ఇప్పటివరకు నాగార్జున కొనసాగిస్తున్నారు. కేడీ , రగడ, భాయ్, రాజన్న, గగనం, సోగ్గాడే చిన్ని నాయనా.. కొత్తగా దేవదాస్.. ఇలా అంతా కొత్తవారితో, ఒకటి రెండు చిత్రాల దర్శకులతో.. కొత్త ఆలోచనలతో వచ్చిన వారితో ముందుకు వెళుతుంటారు. ప్రస్తుతం నాగ చైతన్య తండ్రి దారిలో వెళుతూ చేసిన సినిమానే.. ఈ ‘ సవ్యసాచి’..
కథలో కొత్త దనం ఉన్నా.. కథనంలో చూపించలేకపోయారు…
కథలోకి వెళితే విన్నప్పుడు ఒక కొత్త పాయింట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అదే విషయం ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు. పాయింట్ బాగుంది..అని.. నిజమే ‘ఏదైతే ‘లైన్’ అనుకున్నారో.. సినిమా ఆ లైన్‌లో వెళ్ల లేదు. ఇంట్రడక్షన్ లో చూపించినట్టు ఏదో అద్భుతం జరగబోతోందనిపించి.. ప్రేక్షకుడిని ఒక పీక్ కి తీసుకువెళ్లి.. మళ్లీ దాన్ని ఆ స్థాయిలో అందించలేక జారుడు బల్ల మీద నుంచి సర్రున జారినట్టు జారిపోయారు. అక్కడే ఈ సినిమా కూడా ప్రేక్షకుడి నుంచి జారిపోయింది.
సినిమాకి వచ్చేసరికి అంత హడావుడి లేకుండా… ప్రశాంతంగా మొదలు పెట్టి.. అదీరీతిలో ముగించి ఉంటే కొత్తదనం ఫీలయ్యేవారేమో.. అలా కాకుండా హడావుడిగా మొదలుపెట్టి.. అభిమన్యుడిలా పద్మవ్యూహలో ఇరుక్కుపోయి.. చివరి వరకు పోరాడారు, అందరితో శభాష్ అనిపించుకున్నారు.. కానీ విజయం వైపు నడిపించలేకపోయారు.
ఇదో పైకి కనిపించని కవల సోదరుల కథ…
‘వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్..’ ( మెడికల్ టెర్మినాలజీ ) తో పుట్టిన కుర్రవాడు చైతన్య. సినిమాలో అతని పేరు విక్రమ్ ఆదిత్య.. ‘వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్..’ అంటే ఏం లేదండి.. కవల పిల్లలుగా మొదలైన పిండం..అంటే ఇద్దరుగా మొదలై.. చివరికి ఒకరిగా పుట్టడం, ఇక్కడ చిత్రం ఏమిటంటే..
ఆ ఒక వ్యక్తిలోనే మరో వ్యక్తి కూడా ఉంటాడు. భావోద్వేగానికి గురైనా, సంతోషం కలిగినా హీరో ఎడమ చేతి వైపున ఉంటూ.. ఆ రెండో మనిషి స్పందిస్తుంటాడు. ఒకరి పేరు విక్రమ్.. మరొకరి పేరు ఆదిత్య. హీరో అమ్మ అలా పిలుచుకుంటుంది. ఇది మనకు ‘హలో బ్రదర్’ సినిమాలోను గుర్తుకుతెస్తుంది.
( హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్.. ఇద్దరు బ్రదర్స్.. అందులోనూ ట్విన్స్. బయటెక్కడో తమ్ముడు డ్యాన్స్ చేస్తే.. జైల్లో మరొక బ్రదర్ డ్యాన్స్ చేసేస్తుంటాడు.. అలాగే ఫైట్ కూడా.. గుర్తొచ్చిందా?)
అయితే హలో బ్రదర్ సినిమాంతా ఒక టెంపోలో వెళ్లిపోతుంది. అప్ అండ్ డౌన్స్ ఉండవు..ఇది కొండెక్కించి.. ఒక్కసారి ప్రేక్షకుడిని కిందకు తోసేసినట్టయ్యింది. నిజానికి ఒక టైమ్ లో‘ హలో బ్రదర్’ సినిమాని రీమేక్ చేయాలని నాగ చైతన్య చాలా ఉత్సాహపడ్డాడు.
ఎందుకంటే నాగార్జునకు శివ ఒక బ్రేక్ ఇచ్చినా.. అది క్లాస్ మూవీ లెక్కలోకి వెళ్లిపోయింది. ఒక పూర్తి మాస్ హీరోగా.. జనంలో నిలబెట్టిన సినిమా ..హలో బ్రదర్.. మాత్రమే.. అందుకే రీమేక్ విషయంలో తొందరపడలేదు.. ఏమాత్రం అటూ ఇటైనా.. రాంగోపాల్ వర్మ ‘షోలే’ లా మారుతుందని అనుకొని ఉండవచ్చు. కానీ నాగచైతన్యలో హలో బ్రదర్ పై ప్రేమ తగ్గలేదు..అందుకే ఈ కథకు ఓటేసి ఉండవచ్చు.
విలన్‌గా కిక్ ఇవ్వలేని మాధవన్…
అమెరికాలో కూడా కొంత భాగం సినిమా నడుస్తుంది. ఇంత వరకు లవర్ బాయ్, చక్కని హీరోగా అందరికీ పరిచయం ఉన్న మాధవన్.. ఒక్కసారిగా విలన్ గా కనిపిస్తారు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే జగపతిబాబులో మాస్ ఛాయలు పుష్కలంగా ఉన్నాయి..విలన్ గా ఆదరించారు. ఇక అర్జున్ కూడా మాస్ హీరోనే..అందుకే సాఫ్ట్ విలన్ గా చేసినా ఆకట్టుకున్నాడు.
ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి కూడా విలన్ గా చేసి అలరించారు. అదే రీతిలో మాధవన్ ట్రై చేశాడు. ఇక్కడ సమస్యేమిటంటే అరవింద స్వామి అతి తక్కువ సినిమాలు చేశాడు. కానీ మాధవన్ ఒక మధ్య తరగతి ప్రేమికుడిగా అందరిలో ఫీల్ ఉన్న వాడు..అతన్ని కూడా సడన్ గా విలన్ గా చూడటం వల్ల.. సినిమాకి.. కిక్ రాలేదు.
హీరోయిన్ కీర్తి అగర్వాల్ బాగుంది.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, సత్య, సుదర్శన్, తాగుబోతు రమేష్..వీరందరూ ఇంతవరకు చేసిన సినిమాలకు రొటీన్ కి భిన్నంగా కనిపించి హాస్యం పండించారు..అక్కడక్కడ రిలీఫ్ ఇచ్చింది వీరే.. మాధవన్, నాగచైతన్య పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. యువరాజ్ ఫొటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ కనిపించింది.
చాలాకాలం తర్వాత.. ఒక యువ హీరో సినిమాకి పనిచేసిన కీరవాణి..సంగీతం..కూడా ఆధునికతకు తీసిపోకుండా ఉంది. సంగీతానికి వయసుతో సంబంధం లేదు..మనసుతోనే అని మరొక్కసారి ఈ సినిమాలో కీరవాణి నిరూపించాడు. మ్యూజిక్ కంపోజిషన్.. ఆదునిక యువ మ్యూజిక్ డైరెక్టర్లకి తీసిపోని విధంగా చేశాడు.
చివరగా చెప్పొచ్చేదేమిటంటే…
మొత్తానికి ఈ సినిమాను ఒకసారి సరదాగా ఫ్యామిలీతో వెళ్లి చూసి రావచ్చు. ఎందుకంటే ఏదో చెత్త సినిమా చూసి.. అయ్యో బాగా లేదని అనుకునేకన్నా.. ఒక కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తే.. తీసే వారికి ఉత్సాహంగా ఉండి.. మరికొన్ని ప్రయోగాలు చేస్తారు. లేదంటే ఊకదంపుడు సినిమాలే చేసుకుంటూ వెళ్లిపోతారు. సినిమా చూడటం వల్ల న (క)ష్టం లేదు.. ఫర్వాలేదు.. బాగానే ఉంది.
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు.
నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్.వై, మోహన్ చెరుకూరి(సివిఎం)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: యువరాజ్
ఫైట్స్: రామ్‌లక్ష్మణ్
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
-
– శ్రీనివాస్ మిర్తిపాటి