మోడీ జోష్: భారీ లాభాలు నమోదు చేసిన మార్కెట్లు

5:50 pm, Mon, 11 March 19
modi-markets

ముంబై: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పలు మీడియా ఛానళ్లు సర్వేలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారే మళ్లీ అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఈ క్రమంలో మోడీ జోష్ తో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభాలు సాధించాయి.

ఎగబాకిన మార్కెట్లు

2019 ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ గెలిచే అవకాశాలున్నట్లు విశ్లేషకుల అంచనాలతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా సోమవారం నాటి మార్కెట్లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సెన్సెక్స్‌ 380 పాయింట్లు ఎగబాకి ప్రతిష్ఠాత్మక 37వేల మార్క్‌ను దాటగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) నిఫ్టీ 133 పాయింట్లు లాభపడింది.

కాగా, సోమవారం ప్రారంభం నుంచే మార్కెట్ల లాభాల జోరు మొదలైంది. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడలేదు. కొనుగోళ్ల అండతో అంతకంతకూ ఎగబాకుతూ భారీ లాభాన్ని దక్కించుకుంది.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 382 పాయింట్లు లాభపడి 37,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11,168 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.91గా కొనసాగుతోంది.