28.2 C
Hyderabad
Tuesday, November 24, 2026
- Advertisement -
Home బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్, తల్లి మరణించిన కొద్దిరోజులకే…

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్, తల్లి మరణించిన కొద్దిరోజులకే…

Bollywood Actor Irrfan Khan Dies at the age of 54
Bollywood Actor Irrfan Khan Dies at the age of 54
- Advertisement -

ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 

మంగళవారం నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

1967 జనవరి 7న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఇర్ఫాన్ ఖాన్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినీరంగానికి వచ్చి నటుడిగా నిలదొక్కుకున్నారు. 

తన శ్రమ, పట్టుదలతో విలక్షణ నటుడిగా ఎదిగి ఇటు బాలీవుడ్‌లోనే కాక అటు హాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించారు. దాదాపు 100 చిత్రాలు నటించిన ఇర్ఫాన్ తెలుగులో మహేశ్ బాబు నటించిన ‘సైనికుడు’లో కూడా ప్రతినాయక పాత్ర పోషించారు.

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నటుడు ఇర్ఫాన్. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి, మెప్పించగల నటనా సామర్థ్యం కలిగిన వాడు. 

బాలీవుడ్ హిట్ సినిమాలైన పీకూ, మక్భూల్, హాసిల్, పాన్ సింగ్ తోమర్‌ సినిమాల్లోనూ ఇర్ఫాన్ ముఖ్యపాత్ర పోషించారు. ఇంకా లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్, స్లమ్‌డాగ్ మిలియనీర్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. 

2003లో విడుదలైన ‘హాసిల్’ చిత్రం ఆయన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆపైన వరుస చిత్రాలతో ఆయన ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 2011లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదును ఇచ్చి సత్కరించింది. 

రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో…

ఇర్ఫాన్ ఖాన్ రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. గత ఏడాది లండన్ వెళ్లి చికిత్స కూడా తీసుకున్నారు. దీని కోసం ఏడాదిపాటు అక్కడే ఉన్న ఇర్ఫాన్ 2019 మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చారు. 

ఆ తరువాత ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో కూడా ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం షూటింగులో ఉండగానే ఆయనకు అనారోగ్యం తీవ్రమైంది. దీంతో ఈ చిత్రం షూటింగ్ కూడా కొంతకాలం నిలిచిపోయింది.

ఆ సమయంలో కూడా కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆయన కొద్దిగా కోలుకోగానే తిరిగి చిత్రం షూటింగులో పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. 

మళ్లీ చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడంతో ఇర్ఫాన్ ‘అంగ్రేజీ మీడియం’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.  

అంతర్జాతీయంగా కూడా ఇర్ఫాన్‌కు ఎందరో అభిమానులున్నారు. 2013లో ఆయన ‘పాన్ సింగ్ తోమర్’ సినిమాకుగాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. ఇది బందిపోటుగా మారిన ఓ అథ్లెట్ జీవిత కథ.

2013లో ‘ది లంచ్ బాక్స్’ సినిమాకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకున్నారు. ఆ ఏడాది భారత్ నుంచి ఈ ఫెస్టివల్‌కు ఎంపికనైన చిత్రం ఇదొక్కటే.

తల్లి మరణించిన కొద్దిరోజులకే…

ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం(95) ఐదు రోజుల క్రితమే జైపూర్‌లో మృతి చెందారు. అయితే దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇర్ఫాన్ తన తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయారు.

అయితే ఆయన తన తల్లి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా చూశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తల్లి మరణించిన కొద్దిరోజులకే కొడుకు కూడా మరణించడంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.  

- Advertisement -