బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఓ షాీకింగ్ న్యూస్ చెప్పారు. ఆయన తన భార్య మెహర్ జేసియా నుంచి విడిపోయారు. తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి తెర దించుతున్నట్లు ప్రకటించారు అర్జున్ రాంపాల్. తామిద్దరం విడిపోతున్నట్లు ఓ సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. 20 ఏళ్ల తమ వైవాహిక బంధంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, ఈ ప్రకటన చేయాల్సి వస్తుందని ఊహించకపోయినా పరిస్థితులు దీనికి దారి తీశాయని అర్జున్ రాంపాల్, మెహర్ జేసియా ఇద్దరూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
45 ఏళ్ల అర్జున్ రాంపాల్ 1998లో తనకన్నా వయసులో రెండేళ్ల పెద్దదైన మెహర్ జేసియాను వివాహం చేసుకున్నాడు. వాళ్లకు మహికా, మైరా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విడిపోయినా తమ మధ్య ప్రేమ మాత్రం అలాగే కొనసాగుతుందని, ఎప్పటికీ ఒకరి కోసం మరొకరం ఉంటామని, ఇక ఈ విషయమై భవిష్యత్తులో తాము ఏమీ మాట్లాడదలచుకోలేదని వారు స్పష్టంచేశారు.
ఈ జంట విడిపోతున్నట్లు గతేడాదే వార్తలు వచ్చాయి. కొన్ని నెలలుగా వాళ్లు వేరుగా ఉంటున్నారని ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కూడా వెల్లడించింది. వీళ్లు బాంద్రా కోర్టులో కనిపించేసరికి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనే పుకార్లు మొదలయ్యాయి. అప్పట్లో ఈ వార్తలను అర్జున్ రాంపాల్ ఖండించినా.. ఇప్పుడు విడిపోతున్నట్లు స్వయంగా ప్రకటించారు.