ప్రకాశం: కన్నతండ్రే కామంతో కళ్లుమూసుకుపోయి కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం ప్రకాశం జిల్లాలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడేనికి చెందిన బాలిక(10) ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో సొంతగూడెం అయిన తుమ్మలబైలులో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాలిక తల్లి మేకలు కాసేందుకు అడవిలోకి వెళ్లింది. కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రి దాసరి గురవయ్య కన్న కూతురని కూడా చూడకుండా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన ఆ బాలిక తమ్ముడు తల్లి ఇంటికి తిరగిరాగానే జరిగిన ఘటనను వివరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లి తన భర్త నిర్వాకంపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసున్న ఎస్‌ఐ రామకోటయ్య పరారీలో ఉన్న బాలిక తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు గురవయ్యను పోలీసులు ఇప్పటికే తమ అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. కానీ పోలీసులు మాత్రం గురవయ్య తమ వద్ద లేడని, అతడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.