
అమరావతి: మరో కొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అందరిలోనూ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇక పార్టీలు కూడా గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో పరిస్థితులు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. జనసేన పార్టీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం తెలిపారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గంగాధరం మాట్లాడుతూ…గురువారం ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, ఇప్పటికే పాలక, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీ అంటే లెక్కలేని విధంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
కేవలం జనసేన పార్టీ మాత్రమే ఈ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్యుడికి రాజకీయ జీవితం ఇచ్చే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీట్లు ఇచ్చారని తెలిపారు. ఇక ప్రత్యర్ధి పార్టీలు ఓట్ల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేశాయని, అయితే అణగారిన వర్గాలు, మైనారిటీల మద్దతుతో జనసేన పార్టీ ముందుకు వెళ్లిందని చెప్పారు. యువత, మహిళలు, బీసీలు, షెడ్యూల్ కులాల నుంచి జనసేన పార్టీకి కావల్సినంత మద్దతు లభించినట్టు పార్టీ అంతర్గత నివేదికల ఆధారంగా స్పష్టమవుతోందని, పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
చదవండి: ఫలితాల రోజు బాలయ్య సెంటిమెంట్..వర్కౌట్ అవుతుందా..
అది చూసి ఓర్వలేక పాలక, ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ ముసుగులో మైండ్ గేమ్ ఆడుతున్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా సందర్బాల్లో తల్లకిందులయ్యాయని, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏమయ్యాయన్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు.
ఎగ్జిట్ పోల్స్ వ్యాపారం…
ఇక ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు ఒక వ్యాపారం అయిపోయిందని, వీటి వల్ల బెట్టింగులు కట్టి చాలా సంసారాలు నాశనం అయిపోయాయని మాదాసు మండిపడ్డారు. ముఖ్యంగా కార్యకర్తలంతా కౌంటింగ్ సందర్బంగా జాగ్రత్తగా ఉండాలని, దీనిపై అవగాహన ఇచ్చేందుకు పార్టీ తరఫున ఇప్పటికే బుక్స్ ఇవ్వడం జరిగిందని, ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా వాదప్రతివాదనలకు తావివ్వకుండా రిటర్నింగ్ ఆఫీసర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని గంగాధర్ జనసేన ఏజెంట్లకి సూచించారు.








