
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 83 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. తాలిబన్ల ప్రాబల్యం ఉండే ప్రావిన్స్‌లోని సడోఖేల్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆ విమానాన్ని తాలిబన్లే కూల్చేశారా? లేక, సాంకేతిక కారణాలతో కూలిందా? అన్న వివరాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎంతమంది మరణించారన్న విషయంలో స్పష్టత లేదు. ఈ మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో విమానం కూలినట్టు తెలుస్తోంది.
తొలుత ఈ విమానం జాతీయ విమానయాన సంస్థ అరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై స్పందించిన అరియానా ఎయిర్‌లైన్స్ ఈ వార్తలను కొట్టిపారేసింది. తమ విమానాలు అన్ని బాగానే ఉన్నాయని, ఎటువంటి ప్రమాదం సంభవించలేదని స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన విమానం జోర్డాన్‌కు చెందినదిగా గుర్తించారు.
ఘాంజీ ప్రావిన్స్‌లో హిందూకుష్ పర్వతాల వద్ద మంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. 2005లో ఇదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం జరిగింది. అనేకసార్లు సైనికుల విమానాలు ఈ ప్రాంతంలో కూలిపోయాయి.








