
ఢిల్లీ: 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వకూడదన్న బీజేపీ నియమంతో లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్కి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన విషయం తెల్సిందే. అలాగే అనారోగ్య కారణాలతో మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ నేతలకి సముచిత గౌరవం ఇవ్వాలన్న నిర్ణయంతో గవర్నర్లుగా నియమిస్తే బాగుంటుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే సుష్మా ఎన్నికల్లో పోటీ చేయకపోయిన మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకి పదవి దక్కలేదు.
ఆరోగ్య కారణాల రీత్యా ఆమె మంత్రి పదవి చేపట్టడానికి విముఖత ప్రదర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు సుమిత్ర మహాజన్ కూడా ఈ సారి ఎన్నికల బరిలో లేరు. దీంతో వీరి సేవల్ని వినియోగించుకోవాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. వీరిని పెద్ద రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించాలని ప్రభుత్వానికి బీజేపీ సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వీరు పెద్ద రాష్ట్రాలకి గవర్నర్లగా వెళ్లనున్నారు.








