హైదరాబాద్: ఎప్పుడూ వివాదాస్పద సినిమాలు తీస్తూ వివాదాల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వర్మ ఈ సినిమాని చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే టైటిల్‌లో రెండు కులాల గురించి ప్రస్తావన తీసుకురావడంతో ఆయా సామాజికవర్గం వారు వర్మపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ… ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం కమ్మ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని తీస్తున్న చిత్రం కాదని స్పష్టం చేశారు.
అయితే దీనిపై కొందరు అపోహపడుతున్నట్టు అర్థమవుతోందని, కానీ తన చిత్రం కమ్మ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడంలేదని ట్వీట్ చేశారు. ఈ తరహా ప్రచారంలో నిజంలేదని పేర్కొన్నారు. విజయవాడలో ఉండే విభిన్న రాజకీయ వాతావరణం ఆధారంగా తన చిత్ర కథ ఉంటుందని తెలిపారు. అయితే ఈ సినిమాలో అందరి రాజకీయ నాయకులని గురించి చెబుతానని వర్మ వెల్లడించారు.








