

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని మెట్రో స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ మెట్రోస్టేషన్‌లోని ఎస్కలేటర్ నుంచి జారిపడి 18నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.
శ్రీరాంపుర మెట్రో స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాసిని అనే చిన్నారిని వెంటబెట్టుకుని ఆమె తాతయ్య ఆదివారం రాత్రి 8గంటల సమయంలో శ్రీరాంపుర మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లోని ఎస్కలేటర్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి కింద పడింది.
50 అడుగుల పైనుంచి మెయిన్ రోడ్డుపైకి జారి పడటంతో ఆ పాప తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. వారి రోదనలు మిన్నంటాయి.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. పిల్లల్ని వెంటబెట్టుకుని మెట్రో రైళ్లలో ప్రయాణించే తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో ఎస్కలేటర్ల కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎస్కలేటర్లపై ఎక్కేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.








