

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా అతనిపై వేటు వేసింది. రాయుడి బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన పరీక్షకు హాజరుకావాల్సిందిగా ఐసీసీ ఆదేశించింది.
అయితే నిర్ణీత 14 రోజుల్లో అతను హాజరుకాకపోవడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఐసీసీ నిబంధనల్లోని 4.2 క్లాజ్ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా అతనిపై నిషేధం విధించింది.
రాయుడు బౌలింగ్ శైలిని పరిశీలించి.. సక్రమంగానే బౌలింగ్ చేస్తున్నాడని నిర్ధారించే వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సిడ్నీలో జనవరి 13న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడి బౌలింగ్ శైలిపై ఫిర్యాదు అందింది.
అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ క్రికెట్‌లో అతను బౌలింగ్ కొనసాగించే అవకాశం ఉంది. పార్ట్‌టైమ్ స్పిన్నరైన రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు.








