ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇటీవల పిట్స్‌బర్గ్‌లో జరిగిన కాల్పుల సంఘటన మరువకముందే మళ్లీ తుపాకీ గుండ్లు నిందితుడితో కలిపి ముగ్గురి ప్రాణాలు తీశాయి. కొద్ది రోజుల క్రితం పిట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థనా మందిరంపై జరిగిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఫ్లొరిడా రాష్ట్ర రాజధాని టల్లాహస్సీలోని యోగా స్టూడియోలోకి ప్రవేశించిన ఓ దుండగుడు అక్కడ ఉన్నవారిపై ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సంఘటన అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు ప్రకటించారు.
‘‘కాల్పుల సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలి వెళ్లి చూడగా.. పలువురు బుల్లెట్ గాయాలతో కిందపడి ఉన్నారు..’’ అని టల్లాహస్సీ పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.
కాల్పులు జరుపుతున్న దుండగుడిని అడ్డుకోవడానికి యోగా కేంద్రంలో కొంతమంది ప్రయత్నించారని, తమతో పాటు ఇతరులను కాపాడేందుకూ ప్రయత్నించారని, కాల్పుల సంఘటనలో చాలామంది ధైర్యంగా ప్రవర్తించారని సదరు పోలీసు అధికారు వెల్లడించారు.
కాల్పులకు పాల్పడింది ఒకే వ్యక్తి అని, అతడు కూడా చనిపోయాడని, ఇక ఎటువంటి ముప్పు ఉండదని తెలిపారు. ఈ ఘటనపై నగర మేయర్ ఆండ్రూ గిలియమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న వెంటనే తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకొని టల్లాహస్సీకి చేరుకున్నారు.