34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో? రేసులో 14 మంది, కానీ…

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో? రేసులో 14 మంది, కానీ…

ajay-mishra-somesh-kumar
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరు? ఈ ప్రశ్న ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి ఈనెల 31వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. మళ్లీ ఈయన్నే మరో ఆర్నెల్లపాటు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేదని, తదుపరి సీఎస్‌గా సోమేష్ కుమార్‌ను ఎంచుకోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు కొత్త సీఎస్‌కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. సోమవారం ఉదయం సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. సాయంత్రానికల్లా ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. దీంతో కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక సోమవారం రాత్రికి జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

కొత్త చీఫ్ సెక్రటరీ రేసులో సోమేష్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలోనూ ఆయన చాలా కీలకంగా వ్యవహరించారని, ఒక దశలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సమ్మె విషయంలో ఆయన ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారని, దీంతో సీఎం కేసీఆర్ ఆయనవైపు మొగ్గు చూపవచ్చని అంటున్నారు.

రేసులో అజేయ్ మిశ్రా పేరు…

అయితే చీఫ్ సెక్రటరీ రేసులో అజేయ్ మిశ్రా పేరు కూడా వినిపిస్తోంది. అజేయ్‌కు కొంతకాలం అవకాశం ఇచ్చి ఆ తరువాత సోమేష్ కుమార్‌కు సీఎస్ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. అయితే అజేయ్ మిశ్రాకు అవకాశాలు తక్కువేనని, సీఎం కేసీఆర్ నేరుగా సోమేష్ కుమార్‌నే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

పోటీలో 14 మంది స్పెషల్ సీఎస్‌లు…

మరోవైపు సీఎస్ పదవి కోసం 14 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. బీపీ ఆచార్య, బినయ్ కుమార్, అజేయ్ మిశ్రా, పుష్పా సుబ్రహ్మణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, సోమేష్ కుమార్, శాంతి కుమారి, షాలినీ మిశ్రా, అధర్ సిన్హా, వసుధా మిశ్రాలు ఈ పోలీలో ఉన్నట్లు సమాచారం.

అయితే ఎంతమంది పోటీలో ఉన్నా.. ప్రధానంగా వినిబడుతోన్న పేర్లు మాత్రం.. అజేయ్ మిశ్రా, సోమేష్ కుమార్. గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేష్ కుమార్ ఆ తరువాత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖతోపాటు పలు కీలక శాఖల్లోనూ పని చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా సీఎం కేసీఆర్ విశ్వాసం చూరగొన్న ఐఎఎస్‌లలో ఈయన ఒకరు.

దీంతో సీఎం కేసీఆర్ కూడా సోమేష్ కుమార్ వైపే మొగ్గుచూపవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సోమవారం రాత్రిగాని.. లేదంటే మంగళవారం ఉదయానికల్లా కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరన్నది సీఎం కేసీఆర్ తేల్చేసే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisement -