మాపై రెండు కుక్కలను వదిలారు, అది బెడ్రూమ్ అని మాకు తెలియదు: వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ

revanth-annapurna
- Advertisement -

revanth-high-court-annapurna

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. రేవంత్‌ను నేరవిచారణ చట్టం మేరకే తాము అరెస్టు చేశామని తెలిపారు. కొడంగల్‌లోని కోస్గీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశామని ఆమె పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ ఈ మేరకు వివరించారు.
కొడంగల్‌లో రేవంత్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు తొలుత బయటకు రావాల్సిందిగా ఆయన్ను కోరినట్లు పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఎవరూ బయటకు రాకపోగా, పోలీసులపై రెండు కుక్కలను వదిలారని వెల్లడించారు.

ప్రహరీగోడపై సోలార్ ఫెన్సింగ్ ఉందనే…

రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 10 అడుగుల ఎత్తున ప్రహరీగోడపై సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉందని, దీంతో గత్యంతరం లేక ఇంటి గేటు తాళాన్ని పగలగ్గొట్టి లోపలకు ప్రవేశించాల్సి వచ్చిందని, ఇంటిలోకి వెళ్లిన తరువాత కూడా తాము తలుపు కొట్టామనీ, అయితే ఎవరూ తలుపు తీయకపోవడంతో గట్టిగా తోశామని పోలీసులు వివరించారు.

ఈ సందర్భంలో తలుపు లోపలివైపు బోల్టు ఊడిపోయిందనీ, అసలు అది బెడ్రూమ్ అని తమకు అప్పటివరకూ తెలియదని పేర్కొన్నారు. తాము మహిళా పోలీసులతో కలిసి ఇంటిలోకి ప్రవేశించడాన్ని రేవంత్ భార్య గీత మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారనీ, కానీ ఆ విషయమై సంతకం పెట్టేందుకు ఆమె నిరాకరించారని తెలిపారు.

గతంలో కూడా రేవంత్‌రెడ్డి అనేకసార్లు చట్టాలను ఉల్లంఘించారనీ, అనుమతి లేకపోయినా ర్యాలీలు నిర్వహించారని, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

- Advertisement -