టీ క్యాబినెట్: కొనసాగుతున్న ఉత్కంఠ.. 6 నుంచి 8 మందికే అవకాశం, పూర్తి స్థాయిలో ఎప్పుడంటే…

kcr-cabinet-expansion
- Advertisement -

kcr-expansion-of-cabinet

హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించినప్పటికీ సీఎం కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేయలేదని సమాచారం. అంతేకాదు, మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరున జరపాలని కూడా ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దీంతో క్యాబినెట్ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మంత్రి పదవి కోసం కలలు కంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు మరికొన్ని రోజులపాటు ఉత్కంఠ తప్పని పరిస్థితి.

6 నుంచి 8 మందికే…

అంతేకాదు, తెలంగాణ క్యాబినెట్ తొలివిడత విస్తరణలో భాగంగా కేవలం 6 నుంచి 8 మందికి మాత్రమే అవకాశం ఇవ్వాలని, లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరపాలని కూడా సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి తన క్యాబినెట్‌లో అత్యంత విధేయులకు, మంచి పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే చోటు కల్పించాలని కూడా కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం.

శాసనసభ సమావేశాలు నిర్వహించి…

విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ సమయంలోనే శాసనసభ సమావేశాలను కూడా నిర్వహించి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం క్యాబినెట్ విస్తరణ, ఇతర అంశాలపై తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది.

తాను, మరో మంత్రి ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన ద‌ృష్ట్యా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు అయినట్లేనని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. అంతేకాదు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష, కాళేశ్వరం, ఎస్సారెస్పీ పర్యటనల నేపథ్యంలో ఇటు పరిపాలనపై కూడా దృష్టి సారించినట్లయిందంటూ సీఏం తన సన్నిహితులతో పేర్కొన్నారట.

ఎందుకీ ఆలస్యం?

మరోవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర పార్టీల నుంచి తాజా ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్‌లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయని, అందుకే కేసీఆర్ తన మంత్రి వర్గ విస్తరణను ఆలస్యం చేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు.

మరోవైపు తన శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 21న హైదరాబాద్‌కు వస్తున్నందున సీఎం కేసీఆర్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలువనున్నారని, అంతేకాకుండా డిసెంబర్ 26న కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని, ఆ సమయంలో ప్రధాని మోడీతోనూ ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అవుతారని, దీంతో మంత్రివర్గ విస్తరణ డిసెంబర్ ఆఖరునే జరిగే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభమైనట్లే…

కొత్త ఎమ్మెల్యేల పదవికాలం ప్రారంభమైనట్లేనని, తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడి.. శాసనసభను ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన రోజునుంచే వారి పదవీకాలం మొదలైందంటూ సీఎం కేసీఆర్ తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక శాసనసభలో ఒక సభ్యుడిగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించడానికి మాత్రం వారు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

గతంలోనూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా వారు ఇలా ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన కొన్ని సందర్భాలను సైతం ఉటంకించినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మే నెల 16న ఫలితాలు వెలువడితే.. జూన్‌ 9న ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారంటూ ఆయన గుర్తు చేసినట్లు సమాచారం.

ఏది ఏమైనా డిసెంబర్ నెలాఖరునాటికి కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి యోగం కలుగనుంది. మరికొందరికి మాత్రం లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే మంత్రి యోగం కలుగనుంది.

- Advertisement -