24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ముగిసిన ఓటింగ్, కాసేపట్లో ఫలితాలు!

ఎమ్మెల్సీ ఎన్నికలు: ముగిసిన ఓటింగ్, కాసేపట్లో ఫలితాలు!

- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌-1లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి మాక్ (నమూనా) పోలింగ్ నిర్వహించారు.

మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీ-టీడీపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి గూడూరి నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.

దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మహముద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం.. అలాగే మజ్లిస్‌ అభ్యర్థి రియాజ్‌ ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్ ముగియడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. మరికాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

 

- Advertisement -