న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ రద్దుపై వేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే దీనిపై ఉమ్మడి హైకోర్టుకే వెళ్ళాలని పిటిషనర్ బొమ్మిరెడ్డి రామచందర్‌కు సుప్రీం కోర్టు సూచించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరద్దమంటూ బొమ్మిరెడ్డి రామచందర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తొమ్మిది నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేయడం అన్యాయమని, దీని వలన తెలంగాణ ప్రజలపై అధిక భారం పడుతుందని పిటిషనర్ బొమ్మిరెడ్డి రామచందర్ ఆ పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా గవర్నర్ మళ్ళీ కె. చంద్రశేఖరరెడ్డినే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమించారని, ఈ విషయంలో కూడా సుప్రీం జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరారు.
హైకోర్టుకే వెళ్లండి…
దీనిపై విచారణ జరిపిన సుప్రీం తెలంగాణ అసెంబ్లీ రద్దు పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టుకే వెళ్ళాలని పిటిషనర్‌కు సూచించింది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు, ఓటరు జాబితా సవరణ వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయని, వాటన్నింటినీ హైకోర్టుకే బదలాయించామని సుప్రీంకోర్టు తెలిపింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నందున ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలంటూ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మానం తోసిపుచ్చింది. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు రావడం సమంజసం కాదని స్పష్టం చేసింది పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.